T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. పాక్‌పై అమెరికా ‘సూపర్’ విక్టరీ

www.mannamweb.com


డల్లాస్‌: ప్రశాంతంగా సాగిపోతున్న టీ20 ప్రపంచకప్‌ 2024లో పెను సంచలనం నమోదైంది. పాకిస్థాన్‌పై అమెరికా చరిత్రాక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్‌ ఎ లో డల్లాస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. సూపర్‌ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. ఇందులో 7 రన్స్‌ ఎక్స్‌ ట్రాలే. 19 పరుగుల లక్ష్యఛేదనలో పాక్‌ 13/1 రన్స్‌కు పరిమితమైంది.

అంతకముందు 160 పరుగుల లక్ష్యఛేదనలో అమెరికా ఓపెనర్‌ స్టీవెన్ టేలర్‌ (12) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరినా.. కెప్టెన్ మోనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఆరోన్ జోన్స్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్ కుమార్ (14; 14 బంతుల్లో) రాణించారు. చివరి ఓవర్‌లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో నాలుగు సింగిల్స్‌, ఓ సిక్స్‌ వచ్చాయి. చివరి బంతికి నితీశ్ ఫోర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ అమిర్‌, నసీమ్ షా, హరిస్‌ రవూఫ్‌ తలో వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ బాబర్‌ అజామ్ (44; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ షాదాబ్‌ ఖాన్‌ (40; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఇప్తికార్‌ అహ్మద్ (18), షాహీన్‌ అఫ్రిది (23) పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అమెరికా బౌలర్లలో కెంజిగే 3, నేత్రవల్కర్ 2, అలీ ఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.