అత్యాధునిక సాంకేతికత, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ఈ రైల్వే వంతెనను నిర్మించారు. ఈ వంతెన ప్రారంభం… కశ్మీర్‌లో కొత్త యుగానికి నాంది పలకనుంది. ఇది పర్యాటక అభివృద్ధికి కేంద్రంగా మారడమే కాకుండా, వ్యాపారం, ఉపాధి అవకాశాల పెంపు, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. దీని నిర్మాణం ద్వారా…కశ్మీర్‌లో మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రధాని మోదీ కీలకమైన చర్య తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లో చినాబ్ రైల్వే బ్రిడ్జిని జూన్ 6న ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్ల ఎత్తు ఉంటుంది. ఇక ప్యారిస్‌లోని ప్రపంచ వింత అయిన ఈఫిల్ టవర్‌ను కూడా తలదన్నేలా ఈ చినాబ్ రైల్వే వంతెన ఉంటుంది. చినాబ్ నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో ఇంజినీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంతో…దేశానికి కశ్మీర్‌తో మరింత దృఢమైన బంధాన్ని ఏర్పరచింది ఇండియన్ రైల్వేస్. పర్వతాలను చీల్చుకుంటూ, లోయలను దాటుకుంటూ ఎన్నో వంతెనలు, సొరంగాల ద్వారా ప్రయాణికులను గమ్యానికి చేరుస్తుంది ఈ రైల్వే లైన్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్ బ్రిడ్జ్. కుతుబ్ మినార్ ఎత్తు 72 మీటర్లు, ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు ఉంటే, రివర్ బెడ్ నుంచి చినాబ్ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు ఉంటుంది. ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. గంటకు 266 కి.మీ వేగంతో గాలులు వీచినా వంతెన చెక్కుచెదరదు. ఈ రైల్వే బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో కట్రా – శ్రీనగర్ మధ్య 3 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది.
ఈ చినాబ్ రైలు వంతెనను ప్రధాని మోదీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఇక ఇదే వంతెనపై నుంచి వెళ్లే కట్రా – శ్రీనగర్ వందే భారత్ రైలును కూడా పచ్చజెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. జమ్మూ ప్రాంతంలోని కట్రా రైల్వే స్టేషన్‌కు ప్రధాని రాక సందర్భంగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో పకడ్భంది ఏర్పాట్లను చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత, జమ్మూకశ్మీర్‌కు మోదీ వెళ్లడం ఇదే మొదటిసారి.
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. 272 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ ప్రాజెక్ట్, కశ్మీర్ లోయను మిగతా భారతదేశంతో రైల్వే మార్గం ద్వారా కలుపుతుంది. అత్యాధునిక సాంకేతికత, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ఈ రైల్వే వంతెనను నిర్మించారు. ఈ వంతెన ప్రారంభం… కశ్మీర్‌లో కొత్త యుగానికి నాంది పలకనుంది. ఇది పర్యాటక అభివృద్ధికి కేంద్రంగా మారడమే కాకుండా, వ్యాపారం, ఉపాధి అవకాశాల పెంపు, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. దీని నిర్మాణం ద్వారా…కశ్మీర్‌లో మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రధాని మోదీ కీలకమైన చర్య తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి కల. బ్రిటీష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజినీర్లను నియమించినా ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అది ఇన్నాళ్లకు నెరవేరింది ఈ వంతెన నిర్మాణానికి కేంద్రం రూ.1,486 కోట్లు ఖర్చు చేసింది. ఈ వంతెన ప్రారంభోత్సవంతో… భారత రైల్వే నెట్‌వర్కుతో జమ్మూకశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుంది.
































