హర్యానాలో బీజేపీ దూసుకెళ్తోంది.. మూడో సారి అధికారం చేపట్టే దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 48, కాంగ్రెస్ 36, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
చాలా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది.. మధ్యాహ్నం అవ్వడంతో ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి.. హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్‌కుమార్‌పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వినేష్ ఫోగట్ గెలుపొందారు.. తొలి నుంచి లీడ్‌లో కొనసాగిన రెజ్లర్ వినేష్ ఫోగట్.. మధ్యలో వెనుకంజలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని విజయం సాధించారు.
హర్యానా సీఎం నయాబ్ సైనీ ముందంజలో ఉన్నారు. ఆయన లాడ్వా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హర్యానా మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా 7 రౌండ్ల ముగిసేసరికి 36 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం.. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది.. అయితే.. చాలా నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనేటట్లు పోటీ ఉండటంతో.. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ నెలకొంది..
కాంగ్రెస్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ
కాగా.. హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నలు సంధించారు. లోక్‌సభ ఫలితాల మాదిరిగానే హర్యానాలో కూడా ఎన్నికల ట్రెండ్‌లను ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో షేర్ చేస్తున్నారని ఆయన అన్నారు. పరిపాలనపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు, ఫలితాల వెల్లడికి తేడా ఉందంటూ ఎన్నికల కమిషన్ తీరుపై పవన్ ఖేరా సైతం పలు ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్ నేతల ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందంటూ పేర్కొంది.. అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. కౌంటింగ్ ప్రక్రియ సవ్యంగా, పారదర్శకంగా ఉందని EC వివరించింది. ఏ కౌంటింగ్ కేంద్రం నుంచి తమకు ఫిర్యాదు రావడం లేదని తెలిపింది.