YCP : చంద్రబాబు ను అరెస్ట్ చేయడం మీము చేసిన పెద్ద తప్పు – కేతిరెడ్డి

గత ఎన్నికల్లో ఏపీ(AP)లో వైసీపీ(YCP) ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 175 కు 175 సాధిస్తాం అంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేసిన ప్రజలు మాత్రం 11 సీట్ల తో సరిపెట్టారు.


ఓటమి తర్వాత కొన్ని రోజుల పాటు ఈవీఎం మాయాజాలం అంటూ ఆరోపణలు చేశారు. కార్యకర్తలను కూడా అదే నమ్మేలా చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు వాస్తవ పరిస్థితులను చెప్పుకొస్తున్నారు. ధర్మవరం నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatarami Reddy)..సైతం గతంలో ఈవీఎం పై ఆరోపణలు చేసినప్పటికీ, ఇప్పుడు తన ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి కొన్ని ముఖ్యమైన కారణాలను వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ చేయడం మీము చేసిన పెద్ద తప్పిదమని, దీనివల్ల ప్రజల్లో సానుభూతి కలిగిందని, ముఖ్యంగా ఆయనకు చెందిన ఓటర్లు ఐక్యంగా మారారని అభిప్రాయపడ్డారు. అంతేగాక టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేయడం కూడా పార్టీకి వ్యతిరేకంగా మారిందని చెప్పుకొచ్చారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని కేతిరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో పవన్‌ను అడ్డగించడం లాంటి ఘటనలతో ఆయన కమ్యూనిటీ, కార్యకర్తలు మరింత ఐక్యంగా మారేలా చేసిందని, ఈ సంఘటనలే వైసీపీకి ప్రతికూలంగా మారాయని తెలిపారు. ఎన్నికల ముందు జరిగిన ఈ సంఘటనలు జనసేన-టీడీపీ కూటమికి గెలుపు ఆద్యం పోశాయని పేర్కొన్నారు. ఇక, ఇసుక మరియు మద్యం పాలసీల విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యాయని కేతిరెడ్డి అంగీకరించారు. ప్రభుత్వమే వ్యాపారం చేయకూడదని, అయితే ఆ సమయంలో తీసుకున్న విధానాలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయని చెప్పారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు ఈవీఎం మాయాజాలంపై ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు తమ పార్టీ లోపాలను అంగీకరిస్తూ మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో తీసుకున్న తప్పుడు వ్యూహాలు, ప్రతిపక్ష నేతలపై చేసిన దాడులు వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలుగా మారాయని కేతిరెడ్డి వ్యాఖ్యలు చెబుతున్నాయి.