YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో పై సొంత పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది. ఉన్న పథకాలకి కొంచెం మెరుగులు దిద్ది స్వల్ప మొత్తంలో కేటాయింపులు పెంచి ప్రకటించడంపై వారు పెదవి విరుస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాల మాదిరిగా ఏవీ కనిపించలేదు. ఇదే వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ముఖ్యంగా రుణమాఫీ ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ జగన్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉంది. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేశామన్న సానుకూలత తప్ప.. ఇతర విషయాల్లో ఏమాత్రం సంతృప్తి కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు భారీగా ప్రకటించి ఉంటే పరిస్థితి బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి సంక్షేమం అంటేనే చంద్రబాబు దూరంగా ఉంటారు. కానీ గత ఎన్నికల్లో జగన్ సంక్షేమ పథకాల హామీ ఇచ్చారు. అందులో కొంత వరకు అమలు చేశారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కింది. ఉప ఎన్నికల్లో సైతం ఆ పార్టీ దూసుకెళ్లింది. ప్రజలు సంక్షేమ పథకాలకు అలవాటు పడ్డారని గ్రహించిన చంద్రబాబు.. తాను సైతం జై కొట్టారు. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతానని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను సైతం ప్రకటించారు. వాటినే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆసక్తికరమైన మేనిఫెస్టోను రూపొందించాల్సి ఉండగా.. పైపై మెరుగులతో.. కొద్దిపాటి కేటాయింపులు పెంచి ప్రకటించడంపై వైసీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. ప్రమాదం తప్పదని భయపడుతున్నాయి. కూటమి పార్టీలు ఇంతకుమించి సంక్షేమంతో మేనిఫెస్టోను ప్రకటిస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ముఖ్యంగా డ్వాక్రా, వ్యవసాయ రుణమాఫీ ప్రకటిస్తారని వైసీపీ శ్రేణులు భావించాయి. ఆ ఒక్క ప్రకటనతో భారీ విజయం దక్కుతుందని ఆశించాయి. కానీ ఆ రెండు అంశాలకు చోటు లేక పోయింది. కేవలం రైతు భరోసా పథకం కింద ఇస్తున్న 13,500 రూపాయలను 16 వేలకు పెంచుతానని మాత్రమే జగన్ ప్రకటించారు. అంతకుమించి వ్యవసాయానికి ప్రోత్సాహం లేదు. ఇప్పటికే చంద్రబాబు సాగు ప్రోత్సాహం కింద సంవత్సరానికి ₹20,000 అందిస్తానని ప్రకటించారు. అటు డ్వాక్రా రుణమాఫీ పై మహిళలు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ నేతలు ప్రచారం చేయడంతో గత రెండు నెలలుగా బ్యాంకులకు రుణ చెల్లింపులు కూడా చేయడం లేదు.
జగన్ చెబితే ఎలాగైనా అమలు చేస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తుంటారు.అభివృద్ధి కంటే సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు.కానీ గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి లేదు.అదే విషయం అడిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెంచామని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే సరిగ్గా ఎన్నికల ముంగిట సంక్షేమం విషయంలో జగన్ వెనక్కి తగ్గడంపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. ఇన్ని రోజులపాటు సంక్షేమాన్ని ప్రచారంగా తీసుకున్నామని.. కానీ మేనిఫెస్టో చూస్తే డొల్లతనం కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కచ్చితంగా ఇది ఎన్నికల్లో ప్రతికూలత చూపుతుందని భయపడుతున్నారు. ఒక్క రుణమాఫీ విషయం ప్రకటించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. మొత్తానికైతే మేనిఫెస్టోతో వైసిపి శ్రేణుల ఆశలు నీరుగారిపోయాయి