Sarath Chandra Reddy: నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిత్వంపై కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న సస్పెన్స్‌కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరదించినట్టే కనిపిస్తోంది.
ఎంపీ అభ్యర్థి పేరును ఖాయం చేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నట్టుగానే- ప్రముఖ పారిశ్రామికవేత్త, అరబిందో శరత్ చంద్రా రెడ్డి అభ్యర్థిత్వానికి పార్టీ అగ్రనాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని సమాచారం.
ప్రస్తుతం నెల్లూరు లోక్‌సభ స్థానంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోన్న విషయం తెలిసిందే. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన విజయం సాధించారు. ఆయనను నెల్లూరు రూరల్ అసెంబ్లీ బరిలోకి దించింది.
ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును తెర మీదికి తీసుకొచ్చింది. నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి ఆయన కొన్ని కండిషన్లు పెట్టారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ టికెట్‌ను తన భార్య ప్రశాంతిరెడ్డికి ఇవ్వాలనేది ఆయన పెట్టిన షరతుల్లో ఒకటి.
ఈ షరుతులకు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం అంగీకరించలేదు. ప్రశాంతి రెడ్డిని కాదని మైనారిటీ నాయకుడికి నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చింది. దీనితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. పార్టీకి గుడ్‌బై చెప్పారు. వేమిరెడ్డి తప్పుకొన్న నేపథ్యంలో లోక్‌సభ ఎంపీ అభ్యర్థి కోసం వడపోత చేపట్టింది.
చివరికి- అరబిందో డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకుంది. తాజాగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఆయన స్వస్థలం నెల్లూరే. స్థానికుడు కావడం, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు కావడం కలిసొస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆర్థికంగా బలవంతుడు.
జిల్లా వ్యాప్తంగా బంధువులు ఉండటం ప్లస్ పాయింట్స్‌గా భావిస్తున్నాయి. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా లేకపోలేదు. సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో అప్రూవర్‌గా కూడా మారారాయన.