పదవ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు చాలా ఒత్తిడికి గురవుతారు. కొద్ది రోజుల ముందు నుండి పరీక్షలు కోసం పుస్తకాలతో కుస్తీ పడతారు. ఓ వైపు చదవడంతో పాటు రకరకాల ట్రిక్స్ ను, సెంటిమెంట్ లను ఫాలో అవుతూ ఉంటారు.పిల్లల చదువుల కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం తెగ హైరానా పడతారు. తమ పిల్లలు పరీక్షలలో పాస్ అయ్యి మంచి మార్కులు వస్తె దర్శనం చేసుకుంటామని , ముడుపులు చెల్లించుకు కుంటామని తమ ఇష్ట దైవాలకు కొందరు తల్లిదండ్రులు మొక్కులు మొక్కుకుంటారు. ఇక పరీక్షల ప్రారంభం రోజైతే కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను దగ్గరుండి ఉదయాన్నే ఆలయానికి తీసుకువెళ్ళి పెన్ను, హాల్ టికెట్ను దేవుడు వద్ద ఉంచి పూజలు చేశాకే పరీక్ష కేంద్రంకి తీసుకువెళతారు.
ప్రతియేటా 10th క్లాస్ పరీక్షలు వస్తున్నాయంటే చాలు …పరీక్షలకు కొద్ది రోజుల ముందు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని విజయగణపతి ఆలయంలో ఓ ఆనవాయితీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆలయ నిర్వాహకులు పరీక్షలు రాసేందుకు వెల్లే 10th క్లాస్ విద్యార్థులకి ప్రత్యేక పూజలు చేసిన పెన్నులను విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు. అయితే పెన్ను కావాలనుకునే వారు పూజకు ముందు రోజే ఆలయంలో పరీక్ష రాసే విద్యార్థి గోత్రనామాల వివరాలు అందివ్వాలి. పరీక్షలు ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే ఉండటంతో విద్యార్థి గాని, తల్లిదండ్రులు గాని పూజల్లో ఉండాల్సిన పని లేదు. పూజ జరిగిన మరుసటి రోజు ఆలయానికి వచ్చి పేరు గోత్రం చెబితే చాలు పూజ చేసిన పెన్నుని విద్యార్థికి అందజేస్తారు.
భగవంతుడి ఆరాధనలో సహస్ర నామార్చన గురించి వినే ఉంటారు. సహస్ర కళశాభిషేకం, సహస్ర స్వర్ణ పుష్పార్చనలు గురించి తెలిసే ఉంటుంది. కానీ దేవుడికి సహస్ర కలములతో పూజ చేయటం శ్రీకాకుళంలోని విజయగణపతి ఆలయంలోనే ప్రత్యేకం. ఈ ఏడాది 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న వేళ స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరo ఫాల్గుణ శుద్ధ సప్తమి పర్వదినం సందర్భంగా గురువారం స్వామివారికి ప్రత్యేకంగా సహస్ర కలములు (1008 పెన్నులు)తో ప్రత్యేకపూజలు చేసి విద్యార్థులకు శుక్రవారం ఆ పెన్నులను అందజేశారు.
ముందుగా స్వామివారి సుప్రభాత సేవ అనంతరం అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం గణపతి హోమాన్ని నిర్వహించి పూజలు చేశారు. అలా పూజ చేసిన పెన్నుతో పరీక్షలు రాసిన విద్యార్థి తప్పక పరీక్ష పాస్ కావడమే కాదు, మంచి మార్కులు కూడా వస్తాయని విద్యార్థులు, పలువురు తల్లిదండ్రులు నమ్మకం. ఈ ఆనవాయితీని 2005 నుండి విజయ గణపతి ఆలయంలో నిర్వహిస్తూ వస్తున్నారు.
2005లో ఐదు వందల పన్నులతో పూజలు చేయగా తరువాత ఏడాది నుండి వెయ్యి ఎనిమిది పన్నులతో పూజలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ మహిమ గల పెన్నుల గురించి ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి క్రమేపీ ఈ పెన్నులకు విద్యార్థుల నుండి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో పేరుకి సహస్ర కలముల పూజ ఆని చెబుతున్నా రెండు వేల నుoడి 3వేల పెన్నులకి పూజలు చేసి విద్యార్థులకు అందజేస్తున్నట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ఏడాది ఈనెల 17 నుండి పదవతరగతి పరీక్షలు ప్రారంభం అవుతోన్న నేపథ్యంలో ఈ మహిమ గల పెన్నులు అందుకున్న విద్యార్థులంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
హిందూ పురాణ ఇతిహాసాలలో సరస్వతి దేవితో పాటు వినాయకుడిని జ్ఞానానికి ప్రతీకగా కొలుస్తారు. మహా భారత కావ్యాన్ని వ్యాసుడు చెప్పగా వినాయకుడే దానిని రాసినట్టు చెబుతారు. అందుకే వినాయకుడి పూజలో పుస్తకాలను స్వామి వారి ముందు పెట్టీ పూజించటం ఆనవాయితీగా వస్తుంది.
































