కారు కొనుక్కోవాలని ప్రతీ ఒక్కరి కోరిక. మధ్య తరగతి ప్రజలు కూడా ఇటీవల కార్లను వినియోగిస్తున్నారు. బ్యాంకులు రుణాలు ఇస్తుండడం, సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ కూడా పెరగడంతో చాలా మంది కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఇప్పటికీ చాలా మంది ధర, మెయింటెనెన్స్‌కు భయపడి కారు కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు.
అయితే ఒక హై ఎండ్ బైక్ ధరలో కారు వస్తే ఎలా ఉంటుంది. అది కూడా ఒక ఎలక్ట్రిక్. దీనిని నిజం చూసి చూపించింది ఇండోర్ రాష్ట్రానికి చెందిన వింగ్స్ ఈవీ అనే భారీ ఆటోమొబైల్ కంపెనీ. కేవలం రూ. 2 లక్షలకే ఒక బుల్లి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. రాబిన్ ఈవీ పేరుతో తీసుకొస్తున్న ఈ కారును జీరో పొల్యుషన్‌తో పాటు తక్కువ ధరలో తీసుకురావడం విశేషం. ఎండ, వాన నుంచి రక్షణగా ఎంచక్కా డోర్లు వేసుకొని ఇందులో ప్రయాణించవచ్చు.
ఒక పెద్ద సైజ్ బైక్‌ను పోలి ఉన్న ఈ కారు ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. రూ. 5 వేలు ముందస్తుగా చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. తొలి ఏడాదిలో 3 వేల యూనిట్స్ ని విక్రయించాలన్న లక్ష్యంతో కంపెనీ ఉంది. బెంగళూరులో ఇప్పటికే 300కిపైగా టెస్ట్ డ్రైవ్‌లను నిర్వహించారు. తొలికారును 2025లో లాంచ్ చేయనున్నారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో తొలుత వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన పనిలేదు. ఈ కారు బేస్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 కి.మీ రేంజ్ ఇస్తుంది. టాప్ వేరియంట్ విషయానికొస్తే సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 90 కి.మీలు దూసుకెళ్లొచ్చు. రోజూ ఆఫీసుతో పాటు ఇతర పనులకు వెళ్లే వారికి ఈ కార్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పార్కింగ్ విషయంలో కూడా టెన్షన్ ఉండదు. ఈ కారు పొడవు.. ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంత ఉంటుంది.
కారు ఇద్దరూ కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. వెనకాల అయితే మరో చిన్న పిల్లాడు కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ కారు ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది ఎలాంటి గేర్లు ఉండవు. భద్రత విషయంలో కూడా ఈ కారు ప్రాధాన్యత ఇచ్చింది. సీట్ బెల్ట్, ఆడియో అలర్ట్స్, సేఫ్టీ వాయిలేషన్ అలర్ట్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. ఇక ఈ కారును మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. ఈ కారు బేస్ వేరియంట్ రాబిన్ ఈవీ ‘ఈ’ వేరియంట్ ధర రూ. 1,99,000గా ఉండనుంది. ఇందులో ఏసీ ఉండదు. ఇక మరో వేరియంట్ ‘ఎస్’ ధర రూ. 2,49,000గా ఉండనుంది. ఇందులో కేవలం బ్లోయర్ మాత్రమే ఉంటుంది. ఇక టాప్ వేరియంట్ ‘ఎక్స్’ ధరను రూ. 2,99,000గా నిర్ణయించారు. ఇందులో ఏసీతో పాటు మరికొన్ని ఫీచర్స్ అందించనున్నారు.