ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) సమయం దగ్గరపడింది. సమయం లేదు మిత్రమా అంటూ అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశం ములుచుకుని అభ్యర్థులు ముందుకెళ్తున్నారు.
ఇదలా ఉంచితే.. పోలింగ్ రోజు ఓటర్లకు లెక్కలేనన్ని అనుమానాలు వస్తుంటాయ్. అసలు ఓటు పడిందా..? లేదా..? ఒకవేళ ఓటు పడిందనుకో తాము వేసిన పార్టీకే పడిందా లేదా.. క్రాస్ అయ్యిందా..? ఇలా చాలా అనుమానాలే వస్తుంటాయ్. అయితే.. ఈవీఎంలో మనం ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకోండి!
నచ్చిన అభ్యర్థి పార్టీకి వేసిన ఓటు సక్రమమేనా..? లేక క్రాస్ అయిందా..? అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఓటరు వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) ద్వారా కల్పిస్తోంది. వేసిన ఓటును చూసుకునే అవకాశం ఏడు సెకన్ల వరకు మాత్రమే ఉంటుంది. అనంతరం ఆ ఓటు వీవీ ప్యాడ్ బాక్స్‌లో పడిపోతుంది. ఈ విధానాన్ని తొలిసారిగా 2013 సెప్టెంబరులో నాగాలాండ్‌లో నోక్సెల్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలలో అమలు చేశారు. ఆ తరువాత దశల వారీగా అంతటా అమల్లోకి వచ్చింది. వేసిన ఓటును సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించడం, బహిర్గతం చేయడం మాత్రం నిషేధం. ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది.