తిరుపరంకుండ్రం దీపం వెలిగించుకోవచ్చు: మద్రాస్ హైకోర్టు

దురైలోని ప్రసిద్ధ తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ వివాదంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ డివిజన్ బెంచ్ తుది తీర్పు వెలువరించింది.


ఆలయ భూమిలో, ఆలయ యాజమాన్యం దీపం వెలిగిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం వ్యక్తం చేసిన భయాన్ని కోర్టు కొట్టిపారేసింది. ప్రభుత్వమే స్వయంగా అల్లర్లను ప్రోత్సహిస్తే తప్ప, ఒక దీపం వెలిగించడం వల్ల ప్రజా శాంతికి భంగం వాటిల్లుతుందనే వాదన నమ్మశక్యంగా లేదు అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

తిరుపరంకుండ్రం కొండపై అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం , సిక్కందర్ బాదుషా దర్గా.. రెండూ ఉన్నాయి. కొండపై ఉన్న ఒక రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అది దర్గాకు చెందిన ప్రాంతమని, అక్కడ దీపం వెలిగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతాయని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. దీనిపై గతంలో సింగిల్ జడ్జి దీపం వెలిగించడానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం, సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థించింది.

దర్గా సమీపంలోని సదరు రాతి స్తంభం దర్గాకు చెందిందంటూ చేసిన వాదనలను కోర్టు దుర్మార్గమైనవి అని అభివర్ణించింది. ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించడం అనేది హిందూ భక్తుల ఆచారం అని, భక్తుల కోరిక మేరకు ఆలయ యంత్రాంగం ఆ పని చేయకుండా ఉండటానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి సున్నితమైన విషయాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది.

కోర్టు తీర్పుతో తిరుపరంకుండ్రం మురుగన్ భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదానికి తెరపడటమే కాకుండా, తమ సంప్రదాయం ప్రకారం కొండపై దీపం వెలిగించుకునే వెసులుబాటు కలగడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.