వందే భారత్ ట్రైన్‌లో టూర్ ప్యాకేజీ… కేరళ అందాలు చూసేయొచ్చు

కేరళలోని అందమైన ఆలయాలు, బీచ్‌లు, కోటలు చూడాలనుకుంటున్నారా? వందే భారత్ రైలు ద్వారా ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. మూడు రోజుల యాత్రలో ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి అందాలను ఒకేసారి ఆస్వాదించవచ్చు.


ఐఆర్‌సీటీసీ టూరిజం నార్త్ కేరళ టెంపుల్ రైల్ టూర్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ ట్రిప్ ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది. తిరువనంతపురం, కొల్లం, చెంగన్నూర్, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, త్రిస్సూర్, శోరణూర్, కొళికోడ్ స్టేషన్ల నుంచి బోర్డింగ్ చేయవచ్చు. ఇతర ప్రాంతాల పర్యాటకులు బుక్ చేసినా, యాత్ర ప్రారంభం అయ్యే ముందు బోర్డింగ్ స్టేషన్‌కి చేరుకోవాలి.

ఈ ట్రిప్ ప్రధానంగా కన్నూర్, కాసరగోడ్ ప్రాంతాలను కవర్ చేస్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సిసి కోచ్ సీట్లు ఉంటాయి. మొత్తం రెండు రాత్రులు హోటల్‌లో బస, రెండు రోజుల బ్రేక్‌ఫాస్ట్ అందిస్తుంది. మొదటి రోజు శుక్రవారం, మధ్యాహ్నం కన్నూర్ రైల్వే స్టేషన్‌కి చేరిన తర్వాత హోటల్‌లో చెక్-ఇన్ కావాలి. సాయంత్రం త్రిచంబరం ఆలయం, శ్రీ రాజరాజేశ్వర ఆలయం సందర్శించవచ్చు. రాత్రి కన్నూర్‌లో బస చేయాలి.

రెండవ రోజు శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాసరగోడ్ వెళ్లాలి. అనంతపుర సరస్సు మధ్య ఉన్న ఆలయం సందర్శించి, మధూర్ శ్రీ మదనంతేశ్వర సిద్ధివినాయక ఆలయం చూడవచ్చు. మధ్యాహ్నం బేకల్ ఫోర్ట్ దర్శనం తర్వాత సాయంత్రం కన్నూర్ తిరిగి వచ్చి అదే హోటల్‌లో రాత్రి బస చేయాలి.

మూడవ రోజు ఆదివారం ఉదయం పరశినికడవు శ్రీ ముత్తప్పన్ ఆలయం సందర్శన తర్వాత హోటల్ చెక్‌అవుట్ కావాలి. దక్షిణ భారతదేశంలో వాహనాలు వెళ్లే ఏకైక బీచ్ అయిన ముఝప్పిలంగాడ్ డ్రైవ్-ఇన్ బీచ్ చూడవచ్చు. మధ్యాహ్నం 3 గంటల్లో కన్నూర్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవాలి. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది.

ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.13,460. నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే డిస్కౌంట్ పొందొచ్చు. హోటల్ బస, రోడ్ ట్రాన్స్‌ఫర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, పన్నులు ప్యాకేజీలో ఉన్నాయి. ట్రైన్‌లో భోజనం, వ్యక్తిగత ఖర్చులు, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు ఇందులో లేవు. ఆలయ సందర్శనలు ట్రైన్ సమయాలు, ట్రాఫిక్, సమయపాలన మీద ఆధారపడి ఉంటాయి. పూర్తి వివరాలు http://www.irctctourism.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.