మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ మనకు లభిస్తాయి. అరటి పండ్లను ఎవరైనా సరే ఇష్టంగానే తింటుంటారు. అయితే అరటి పండ్లను రోజూ తింటేనే మనకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ కనీసం ఒక పండును అయినా తింటే మనకు ఏదో ఒక విధంగా లాభం కలుగుతుంది. ఇక ఈ 9 కారణాల వల్ల అయితే మీరు రోజూ ఒక అరటి పండును తప్పనిసరిగా తినాల్సిందే. అవును.. ఇక మనం రోజూ అరటి పండును ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి. కనుక చక్కని పోషణ కావాలంటే రోజూ ఒక అరటి పండును తప్పనిసరిగా తినాలి. అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
అరటి పండ్లలో ఉండే పొటాషియం కండరాల పనితీరును కూడా మెరుగు పరుస్తుంది. దీంతో కండరాల నొప్పులు తగ్గుతాయి. అరటి పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. రోజూ ఒక అరటి పండును తింటే అసలు మలబద్దకం అనేది ఉండదు. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీంతోపాటు కడుపు ఉబ్బరం సమస్య కూడా తగ్గుతుంది.
అరటి పండ్లను తక్షణ శక్తికి మంచి వనరుగా చెప్పవచ్చు. అందువల్ల ఈ పండ్లను నీరసం ఉన్నవారు తింటే వెంటనే కోలుకుంటారు. త్వరగా ఉత్సాహం లభిస్తుంది. దీంతో మళ్లీ చురుగ్గా పనిచేస్తారు. బలహీనత తగ్గుతుంది. అలాగే ఈ పండ్లను వ్యాయామం చేసిన అనంతరం తింటే తిరిగి మళ్లీ శక్తిని పుంజుకుంటారు. అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అని అంటారు. ఇది మన మూడ్‌ను మారుస్తుంది. అందువల్ల అరటి పండ్లను తింటే డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే మైండ్ రిలాక్స్ అయి రాత్రి పూట చక్కగా నిద్రపడుతుంది. నిద్రలేమి నుంచి విముక్తి పొందవచ్చు.
అరటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సహాయ పడుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అరటి పండ్లలో ఉండే విటమిన్ సి, మాంగనీస్ మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అరటి పండ్లలో విటమిన్లు ఎ, సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ముడతలు, మచ్చలు పోతాయి. ఇలా అరటి పండ్లను తినేందుకు ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక రోజూ తప్పనిసరిగా ఒక అరటి పండును తినడం మాత్రం మరిచిపోకండి.