మన దేశంలో అల్లోపతి మందులు రాకముందే ఎంతో పురాతన కాలం నుంచే ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉంది. ఇప్పటికీ చాలా మంది ఆయుర్వేద వైద్యాన్నే ఫాలో అవుతుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది అల్లోపతికి బదులుగా ఆయుర్వేదం ద్వారా తమ రోగాలను నయం చేసుకుంటున్నారు. అయితే ఆయుర్వేదంలో మన ఆరోగ్యం గురించి అనేక విషయాలను చెప్పారు. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో నీళ్లను తాగడం గురించి ఆయుర్వేదంలో వివరించారు. భోజనం చేసే ముందు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, చేశాక కానీ వెంటనే నీళ్లను తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. అయితే దీని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు చూద్దాం.
మనం భోజనం చేసినప్పుడు తినే ఆహారాలు జీర్ణాశయంలోకి చేరగానే అక్కడ పలు ఎంజైమ్‌లతోపాటు యాసిడ్లు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి మనకు పోషకాలను, శక్తిని అందిస్తాయి. అయితే అదే సమయంలో మనం భోజనం చేసిన వెంటనే నీళ్లను తాగడం వల్ల ఆయా ఎంజైమ్‌లు, యాసిడ్ల ప్రభావం తగ్గిపోతుంది. దీంతో అవి సరిగ్గా పనిచేయవు. ఫలితంగా మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్తి సమస్య ఏర్పడుతుంది. దీంతోపాటు గ్యాస్, కడుపు ఉబ్బరం కూడా వస్తాయి. కనుక భోజనం చేసిన వెంటనే నీళ్లను తాగడం మంచిది కాదు…
అధికంగా బరువు పెరుగుతారు..
ఇక భోజనం చేసిన తరువాత వెంటనే నీళ్లను తాగితే మన పొట్టలో నీళ్లు ఎక్కువగా చేరుతాయి. దీని వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక శరీరానికి శక్తి అందదు. ఫలితంగా మన మెదడు మళ్లీ ఆహారం తినాలని జీర్ణాశయానికి సంకేతం పంపిస్తుంది. దీంతో మనకు ఆకలి అవుతుంది. అప్పుడు మళ్లీ ఆహారం తింటాం. ఇలా మనం ఎక్కువ సార్లు ఆహారం తినాల్సి వస్తుంది. దీంతో శరీరంలో చేరే క్యాలరీలు పెరిగిపోతాయి. ఫలితంగా అధికంగా బరువు పెరిగిపోతారు. కనుక ఆహారం తినే సమయంలో లేదా తిన్న వెంటనే అసలు నీళ్లను తాగకూడదు.
మనం భోజనం చేసిన తరువాత వెంటనే నీళ్లను తాగడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐరన్, విటమిన్ బి12, క్యాల్షియం వంటివి మనకు సరిగ్గా లభించవు. దీంతో ఆయా పోషకాల లోపం వస్తుంది. దీని వల్ల మనకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక ఎవరైనా సరే భోజనానికి ముందు లేదా భోజనం చేసే సమయంలో లేదా భోజనం చేసిన వెంటనే నీళ్లను అసలు తాగకూడదు. భోజనం చేయడానికి కనీసం 30 నిమిషాల ముందు నీళ్లను తాగవచ్చు. భోజనం చేశాక 30 నిమిషాలు ఆగి నీళ్లను తాగవచ్చు. అయితే కొందరికి భోజనం చేసే సమయంలో గొంతు పట్టుకుపోయినట్లు అవుతుంది. అలాంటప్పుడు కాస్త నీళ్లను తాగవచ్చు. అంతేకానీ.. భారీ ఎత్తున నీళ్లను తాగకూడదు.
తప్పక జాగ్రత్తలను పాటించాలి..
ఇలా ఆయుర్వేదం మనకు నీళ్లను తాగే విషయంలో అనేక సూత్రాలను తెలియజేసింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ సూత్రాలను పాటించడం వల్ల దాదాపుగా అనేక రోగాలను రాకుండా చూసుకోవచ్చు. నీళ్లను సరిగ్గా తాగకపోతే ఆయుర్వేద ప్రకారం శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల్లో అసమతుల్యతలు ఏర్పడుతాయి. దీంతో మనకు వ్యాధులు వస్తాయి. కనుక భోజనం చేసే సమయంలో నీళ్లను తాగే విషయంపై ప్రతి ఒక్కరు పైన చెప్పిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే వ్యాధులను కొని తెచ్చుకున్న వారు అవుతారు.