సైలెంట్ కిల్లర్.. గుండెపోటు కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఇటీవల, ముఖ్యంగా యువతలో కూడా గుండెపోటు మరణాల కేసులు పెరిగాయి. ముఖ్యంగా.. జీవనశైలి..
అనారోగ్యకరమైన ఆహారం, శారీర శ్రమ లేకపోవడం ఇవన్నీ కూడా గుండెపోటుకు కారణంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండె సమస్యలు, గుండెపోటు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. ముఖ్యంగా, ఇటీవల జిమ్‌లలో వ్యాయామం చేస్తూ చాలా మందికి ఒక్కసారిగా గుండెపోటు బారిన పడటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
అందుకే గుండెపోటు రాకుండా ఉండేందుకు ఎలాంటి సేఫ్ స్టెప్స్ తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. కార్డియాలజిస్టుల ప్రకారం, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది. వారానికి ఒకసారి ఉపవాసం లేదా రోజుకు ఒకసారి తినడం మంచిది.
మంచి నిద్ర గుండె జబ్బులను నివారిస్తుంది. నిద్రలేమి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండెను సురక్షితంగా ఉంచుకోవడానికి 6 నుంచి 8 గంటల నిద్ర – క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఉదయం, సాయంత్రం వేళల్లో నడక, శారీరక శ్రమ మంచిదంటున్నారు..
గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి జీవనశైలి మార్పులు తప్పనిసరి. తినడం, నిద్రపోవడం.. మేల్కొనే సమయం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మార్కెట్‌లో చౌకగా లభించే ఫాస్ట్ ఫుడ్ పిల్లలు, పెద్దలకు హానికరం. గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలను నివారించడానికి సమతుల్య, సాధారణ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం… ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది..
ధూమపానం, పొగాకుకు దూరంగా ఉండండి.. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి.. ఒత్తిడి లేకుండా కుటుంబంతో ఆనందంగా గడపాలి.. అంతేకాకుండా రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.