ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా.. హంగామా చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పేరెంట్స్ మీటింగ్‌ను చంద్రబాబు ప్రచార వేదికలుగా మార్చుకున్నారన్న వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యావ్యవస్థకు ఏం చేశామనే దానిపై వివరాలు వెల్లడిస్తూనే.. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను దెబ్బతీస్తోందంటూ వైఎస్ జగన్ ఆరోపించారు.
వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తూ.. అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగా చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పాఠశాలల్లో సహజంగా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకుంటున్నారని.. ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు.. ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో 15,715 పాఠశాల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలివిడత నాడు-నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పిల్లలందరికీ ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు ఆమోదించి తీర్మానాలు చేశాయన్నారు.
ఆ పేరెంట్స్ కమిటీ సమావేశాలకు కూటమి సర్కారు కొత్త టైటిల్స్ పెట్టి, తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. చివరకు పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతలనుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామంటూ ఊరూరా డప్పుకొట్టారని.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇప్పటివరకూ ఒక్కపైసా ఇవ్వలేదని జగన్ విమర్శించారు.
వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మ ఒడి పథకాన్ని కూడా ఆపేశారని.. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని జగన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్‌కళ్యాణ్, విద్యా శాఖమంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా అంటూ సెటైర్లు వేశారు.
అలాగే మధ్యాహ్న భోజన పథకంపైనా వైఎస్ జగన్ విమర్శలు చేశారు. డొక్కా సీతమ్మ అనే మహా తల్లి పేరుపెట్టి స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థుల డొక్కమాడుస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదని.. విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యంపాడై ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఆరోపించారు. విద్యాదీవెన, వసతి దీవెనలకు ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవని.. వీటికి ఏకంగా రూ.3,900 కోట్లు బకాయిలుగా పెట్టారని మండిపడ్డారు. ఇన్ని చేసి ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా డ్రామాలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు,