జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) బ్లడ్ లోనే కాంగ్రెస్ ఉంది. బాల్యం నుంచి కాంగ్రెస్ పార్టీ అనే కుటుంబంలో గడిపారు ఆయన.
1978లో తొలిసారిగా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి బాల్యంలోనే ఉన్నారు. అది మొదలు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్న పరిస్థితి మారింది. 2004లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు రాజశేఖర్ రెడ్డి. తండ్రి గెలుపు కోసం కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి. 2009లో అనూహ్యంగా కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. 2010లో తండ్రి అకాల మరణం తర్వాత అదే కాంగ్రెస్ పార్టీని విభేదించడం ప్రారంభించారు. అంతవరకు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే తనకంటూ ఒక ముద్ర చాటుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి.
* అప్పట్లో క్యాడర్ అంతా
అయితే తండ్రి రాజశేఖర్ రెడ్డి( Rajasekhar Reddy ) వారసత్వాన్ని కొనసాగించాలని భావించిన జగన్మోహన రెడ్డిని అడుగడుగునా అడ్డగించింది కాంగ్రెస్ పార్టీ. అవమానాలకు గురి చేసింది. అక్రమంగా కేసులు నమోదు చేసి జైల్లో కూడా పెట్టింది. అయితే తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం పరితపిస్తే.. తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ను మొత్తం తన పార్టీలోకి తెచ్చేసారు. తన వెంట వచ్చిన కాంగ్రెస్ సీనియర్లకు మరోసారి అవకాశం ఇచ్చి రాజకీయంగా అందలం ఎక్కించారు. కానీ వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన వారిని.. ఇప్పుడు మరోసారి ఆహ్వానించి వైసీపీలోకి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
* సీనియర్లను ఆహ్వానిస్తున్న జగన్
ఈ ఎన్నికల్లో వైసీపీ( YSR Congress) దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయింది. ఈ తరుణంలో చాలామంది పార్టీ నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను ఆహ్వానించే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. చాలామంది సీనియర్ మోస్ట్ లీడర్లకు స్వయంగా ఆయనే ఆహ్వానిస్తున్నారు. అందులో భాగమే మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరడం. ఆయన వైసీపీలో చేరిన క్రమంలో మిగతా కాంగ్రెస్ సీనియర్ల సైతం వచ్చేస్తారని శైలజానాథ్ చెప్పుకొచ్చారు.
* జాబితా చాలానే ఉంది
వైసీపీలో చేరే కాంగ్రెస్ సీనియర్ల ( Congress seniors )జాబితా చాలానే ఉంది. ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్, కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ.. ఇలా చాలామంది నేతలు ఇప్పుడు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. సరైన ముహూర్తం చూసుకొని వారు సైతం వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే మొత్తం ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మారినట్టు కనిపిస్తున్నారు. ఎంతలా మారారు అంటే తనను నిత్యం ద్వేషించే కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి లాంటి వారిని సైతం పార్టీలోకి ఆహ్వానించేదాకా. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని వైసీపీలో విలీనం చేస్తారేమో నన్న అనుమానం కలిగేలా ఉంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అంటూ ప్రచారం జరిగినా.. ఇప్పుడు రివర్స్ ప్రచారం జరుగుతుండడం విశేషం.