YS Jagan: వచ్చే ఐదేళ్లకు చంద్రబాబు మెసేజ్ ఇదే-వైసీపీ ఆఫీసు కూల్చివేతపై జగన్ ట్వీట్..!

www.mannamweb.com


ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసును ఇవాళ తెల్లవారుజామున బుల్‌డోజర్లతో కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సీఆర్డీయఏ సిబ్బంది బుల్‌డోజర్లతో దీన్ని కూల్చివేశారు.

ఈ కూల్చివేతపై వైసీపీ మండిపడింది. ఇది ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

“ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు.” అంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

అలాగే “ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు @YSRCParty తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను.” అంటూ జగన్ ట్వీట్ లో కోరారు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

వైసీపీ అధికారంలో ఉండగా తాడేపల్లిలోని జలవనరులశాఖకు చెందిన రెండెకరాల స్ధలాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో నిర్మాణాలు స్లాబ్ దశను కూడా దాటాయి. అయితే ఈ నిర్మాణం కోసం అనుమతి తీసుకోలేదన్న కారణంతో సీఆర్డీయే, జలవనరులశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇవాళ కూల్చివేతలు చేపట్టాయి. ఇప్పటికే వైసీపీ దీనిపై హైకోర్టును ఆశ్రయించింది.