YS Vijayamma America Tour : ఏపీ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ.. వైఎస్ విజయమ్మ విదేశాలకు వెళ్లారు. ఇప్పుడిదే ఏపీలో హాట్ న్యూస్. ఎందుకంటే.. సీఎం జగన్ ఒకవైపు.. షర్మిల మరోవైపు చేరి.. ఎన్నికల్లో పోటీకి సై అంటే సై అంటున్నారు. షర్మిలపై జగన్ ప్రత్యక్షంగా విమర్శలు చేయకపోయినా.. ఆ పార్టీనేతలు షర్మిల వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక షర్మిల, సునీత కలిసి జగన్ పై ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వైఎస్ వివేకానంద హత్యకు కారకులను ఇంతవరకూ అరెస్ట్ చేయని సీఎం.. ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారపార్టీ హంతకులకు కొమ్ముకాస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. కూతురు వెనక్కి తగ్గదు. కొడుకుకు సపోర్ట్ చేయలేక.. ఇద్దరి మధ్యన నలిగిపోయిన విజయమ్మ అమెరికా వెళ్లినట్లు సమాచారం. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె అమెరికాకు వెళ్లడంపై ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. తిరిగి ఆమె ఎన్నికలు ముగిశాకే వస్తారని సమాచారం.
సీఎం జగన్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయిలో జరుగుతోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఉంది. ఇదే విజయమ్మకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. గత నెల 27న జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో విజయమ్మ పాల్గొన్నారు. ఆ తర్వాత షర్మిల బస్సుయాత్ర సందర్భంగా కూడా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారామె. ప్రార్థనలైతే చేశారు గానీ.. ఇద్దరిలో ఎవరి తరపున ప్రచారం చేసినా.. అది మరొకరికి నష్టం చేస్తుందని భావించినట్లున్నారు.
కడప జిల్లాలో పర్యటిస్తున్న షర్మిలకు వైఎస్ బిడ్డగా.. ఎనలేని ఆదరణ లభించింది. దానికి తోడు వివేకా హత్యోదంతంపై చేసిన ఆరోపణలు, సునీత మద్దతు కూడా షర్మిలకే ఉండటం ప్లస్ అయింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపమన్నట్లుగా కొడుకు – కూతురు ఉండటంతో.. ఎవరికీ మద్దతివ్వలేక అమెరికాలో ఉన్న మనవడు రాజారెడ్డి వద్దకు వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. మళ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే ఆమె తిరిగి వస్తారని అంటున్నారు.
కాగా.. 2019 ఎన్నికల్లో జగన్ ను సీఎం చేసేందుకు తల్లీకూతుర్లిద్దరూ కష్టపడిన విషయం తెలిసిందే. సీఎంగా పగ్గాలు చేపట్టాక.. తల్లిని, చెల్లిని జగన్ పక్కనపెట్టారన్న విమర్శలు వచ్చాయి. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినపుడు కనిపించిన విజయమ్మ.. ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే ఆయన్ను కలిశారు. ఇటీవల జరిగిన షర్మిల కుమారుడి నిశ్చితార్థంలోనూ అన్న-చెల్లెలు ఎడముఖం పెడముఖంగానే కనిపించారు. రాజారెడ్డి – ప్రియ వివాహానికి కూడా జగన్, ఆయన కుటుంబ సభ్యులెవరూ హాజరు కాకపోవడం ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టింది. ఎవరికీ చెప్పలేక, ఎటూ నిలబడలేక, ప్రచారంలో పాల్గొనలేక విజయమ్మ విదేశాలకు వెళ్లిపోయినట్లు టాక్.