జగన్ నిర్ణయం తప్పని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడం నేల విడిచి సాము చేయడం సామెతను గుర్తు చేస్తుందనే చర్చ జరుగుతోంది. విపక్షంగా ప్రజా సమస్యలను..
ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి వెళ్లబోనంటూ వైసీపీ అధ్యక్షులు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా.. జగన్ నిర్ణయం తప్పని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడం నేల విడిచి సాము చేయడం సామెతను గుర్తు చేస్తుందనే చర్చ జరుగుతోంది. విపక్షంగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో లెవనెత్తాల్సింది పోయి.. తనకు హోదా దక్కకపోవడంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం మూర్ఖత్వపు చర్యగా కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించమేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని లక్షల మంది ఆశిస్తారు. కానీ ఐదేళ్లకోసారి రాష్ట్ర ప్రజలు నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుని తమ ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు. ప్రజా సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో తాను శాసనసభ సమావేశాలకు వెళ్లబోనని, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే దక్కుతుంది. ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమని జగన్ ప్రకటించడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జార విడుచుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
తెలివి తక్కువ పని అంటూ..
శాసనసభ సమావేశాలకు వెళ్లకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలివి తక్కువ పనిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా అనేది సంఖ్యా బలానికి సంబంధించిన అంశమని, తమకు సంఖ్యాబలం ఉన్నా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నిరసన తెలిపాల్సిన జగన్.. సంఖ్యాబలం లేకపోయినా.. గత సంప్రదాయాలకు భిన్నంగా తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం, ఈ కారణంగా శాసనసభ సమావేశాలకు వెళ్లనని చెప్పడం సహేతుక కారణం కాదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని శాసనసభ సమావేశాలకు వెళ్లాలని సొంత పార్టీ నేతలతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు సైతం కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే జగన్ నిర్ణయం చారిత్రక తప్పిదమవుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని, అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి.