YSRCP: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్.. హ్యాండిచ్చేశారుగా..!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) కలలో కూడా ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరికి ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయి క్రికెట్‌ టీమ్‌లాగా 11 కే పరిమితం అయిన పరిస్థితి. దీంతో ఫలితాల మరుసటి రోజే రాజీనామాలు మొదలై.. నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. మాజీలు, కీలక, ముఖ్య నేతలు.. ద్వితియ శ్రేణులు పెద్ద ఎత్తున అధికార టీడీపీలోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పుడిక సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల వంతు వచ్చింది. పార్టీలో ఎప్పుడు ఎవరుంటారో.. జంప్ అయ్యేదెవరో తెలియని పరిస్థితి. ఈ జంపింగ్‌ల విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం చేతులెత్తేసిన పరిస్థితి. ‘ఉండేటోళ్లు ఉండొచ్చు.. పోయేవాళ్లను మనం ఏం చేయగలం.. ఎన్నాళ్లని ఆపగలం’ అని ఇటీవల జరిగిన సమావేశంలో నేరుగా చెప్పేయడంతో ఇక తట్టా బుట్టా సర్దేయడానికి సిట్టింగులు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.


ఇదీ అసలు సంగతి..!

కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఒక్కటంటే ఒక్క సీటుకే ఈ ఎన్నికల్లో పరిమితమైన పరిస్థితి. ఇక నందికొట్కూరు విషయానికొస్తే.. అంతా తనదే అంటూ ఇన్నాళ్లు షాడో ఎమ్మెల్యేగా ఉన్న యువనేత, మాజీ శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు హ్యాండిచ్చేశారు..! మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 18 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ నెంబర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. మున్సిపాలిటీనీ అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతోనే టీడీపీలో చేరినట్టు సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కాగా.. నంద్యాల ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్ కుమార్తె బైరెడ్డి శబరి గెలిచిన సంగతి తెలిసిందే.

గట్టిగానే ఇచ్చేస్తున్నారే!

సొంత నియోజకవర్గంలో లీడర్లను నిలబెట్టుకోలేని బైరెడ్డి గురించి.. వైసీపీ ఎంత బిల్డప్ ఇచ్చిందబ్బా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయ్. ఎంతలా అంటే.. యువనేత, రాష్రమంతా తిరిగి ప్రచారం చేసిన ఉడుకు రక్తం, బైరెడ్డి అంటే లెక్కే వేరులే.. ఇలా ఒకటా రెండా ఓ రేంజిలో వైసీపీ కార్యకర్తలు ఆయన్ను జాకీలేసి లేపారు. సీన్ కట్ చేస్తే.. రాష్ట్రం సంగతి దేవుడెరుగు, సొంత నియోజకవర్గంలో కౌన్సిలర్లను నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు, కార్యకర్తలు నెట్టింట్లో ఆడేసుకుంటున్నారు. ఈ చేరికల వ్యవహారంపై బైరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.