తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని 20వ వార్డు వైకాపా కౌన్సిలర్ దాకే అనిల్‌కుమార్ శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి తాచుపామును తీసుకురావడం కలకలం రేపింది. ఓ సీసాలో బంధించి ఉన్న సర్పాన్ని సంచిలో పెట్టుకొని కౌన్సిల్ సమావేశ మందిరంలోకి తెచ్చి.. తన కుర్చీ పక్కన పెట్టుకున్నారు. ఆ విషయం ఏఈ హేమంత్ దృష్టికి రావడంతో.. సంచి బయటపెట్టి రావాలని కోరినా ససేమిరా అన్నారు. తరువాత ఛైర్మన్ ఆదినారాయణ గట్టిగా చెప్పడంతో పాము ఉన్న సంచిని బయటపెట్టి, హాల్‌లోకి వచ్చారు. ఐదేళ్ల కాలంలో తన వార్డులో అభివృద్ధి పనులేవీ చేపట్టలేదని.. ఖాళీ స్థలాలు, పురపాలక ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అనిల్‌కుమార్ తెలిపారు. ఉదయం పాఠశాల ఆవరణలోంచి తాచుపాము రహదారిపైకి వచ్చిందని, ఓ బాలుడు చూసుకోకుండా దాని పక్కనుంచే వెళ్లాడన్నారు. పాము కాటేసి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వార్డులో పరిస్థితిని వివరించేందుకే ఆ పామును పట్టించి, సమావేశానికి తీసుకొచ్చానని చెప్పారు.

































