Ys Sharmila Challenge: వైవీ సుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్

www.mannamweb.com


YS Sharmila Challenge: పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించిన షర్మిల వైసీపీపై దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఆదివారం సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతో వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. షర్మిల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి సైతం ఆమెను విమర్శించడంతో ఆమె ఘాటుగా స్పందించారు. జగన్‌ రెడ్డి అనడంపై సుబ్బారెడ్డి అభ్యంతరం చెబితే తనకు జగనన్న అనడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

అభివృద్ధి విషయంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. పలాస వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రయాణికులతో ముచ్చటించారు. షర్మిలతో పాటు బస్సులో మాణిక్కం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి ఉన్నారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణించారు.
బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ రెడ్డి అనడం నచ్చలేదని, జగన్‌ రెడ్డి అనడం నచ్చకపోతే, జగనన్న అనే అంటానని ,దానికి తనకు అభ్యంతరం ఏమి లేదని షర్మిల చెప్పారు.

తనను పక్క రాష్ట్రం నుంచి వచ్చానని సుబ్బారెడ్డి అనడంపై స్పందించిన షర్మిల వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు అభివృద్ధి చూపించాలని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని సవాలు చేశారు. అభివృద్ధిని చూడ్డానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి, ప్లేస్‌ టైమ్ మీరే ఫిక్స్‌ చేయాలని, తనతో పాటు మేధావులు, మీడియా కూడా వస్తారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపించాలని కోరారు. ప్రభుత్వం కట్టిన రాజధాని ఎక్కడ, నడుపుతున్న మెట్రో రైళ్లు ఎక్కడ, కట్టిన పోలవరం ఎక్కడో చూడ్డానికి కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నామన్నారు. తామంతా ఎక్కడికి రావాలో టైమ్‌, ప్లేస్‌ వారు చెబితే వచ్చి చూస్తామని షర్మిల ప్రకటించారు.