Zika : భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న జికా వైరస్.. కేంద్రం హెచ్చరిక

www.mannamweb.com


Zika Virus Alert Issued In India : కరోనా నుంచి కాస్త ఊపిరి తీసుకున్న ప్రజలకు ఎప్పటికప్పుడు ఏవో ఒక అంటు వ్యాధుల భయాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. భారత్‌లో తాజాగా జికా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది.

దీంతో అనేక మంది ఈ వ్యాధి బారిన పడి బాధితులుగా మారుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రాలు దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. మహారాష్ట్రలో ఈ కేసులు వేగంగా విస్తరిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలర్ట్‌ జారీ చేసింది. ఆసుపత్రుల్లో ఈ విషయమై ఓ నోడల్‌ ఆఫీసర్‌ని నియమించాలని సూచించింది. దీన్ని నియంత్రించేందుకు పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, ఆఫీసులు.. తదితర చోట్ల ప్రత్యేకమైన దృష్టిని సారించాలని తెలిపింది.

జికా వైరస్‌(Zika Virus) ప్రధానంగా ఏడిస్‌ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అవి మనల్ని కుడితే మనలోకి ఈ వైరస్‌ ప్రవేశిస్తుంది. అలా ఇది మన రక్తంలోకి చేరిపోతుంది. మల్టిప్లై అయి ఇన్‌ఫెక్షన్‌ని కలిగిస్తుంది. లైంగిక సంపర్కం, గర్భవతి అయిన స్త్రీ ప్రసవించినప్పుడు తల్లి నుంచి శిశువుకు, రక్త మార్పిడి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ వల్ల మనలో కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు, మెదడు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటి విధులను అవి సరిగ్గా నిర్వర్తించలేకపోవడంతో మనకు అనారోగ్యం ఎక్కువ అవుతుంది. గర్భంతో ఉన్న స్త్రీలకు ఈ ఇన్‌ఫెక్షన్‌ కలిగితే శిశువులో ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. దీంతో వారు బర్త్‌ డిఫెక్ట్స్‌తో పుట్టే అవకాశాలు ఉంటాయి.

ఒళ్లు నొప్పులు, జ్వరం, చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, కళ్లు ఎర్రబడటం లాంటి లక్షణాలు కనిపిస్తే అది జికా(Zika) ఏమోనని మనం అనుమానించాల్సిందే. అయితే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని గుర్తుంచుకోవాలి. అలా అని దీన్ని తేలిగ్గానూ తీసుకోకూడదు. ఇది ఒకసారే అనేక రకాల అవయవాల మీద ప్రభావం చూపిస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు. కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.