ఆ పెర్ఫ్యూమ్‌ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్‌ అవుతాయ్‌

పెర్ఫ్యూమ్‌లు తయారీలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆహ్లాదభరితమైన వాటి సువాసనే దాని తయారీ వెనుకున్న కృషని కళ్లకు కట్టేలా చూపిస్తుంది. అయితే ఈ పెర్ఫ్యూమ్‌ మాత్రం ఎన్ని కొత్త బ్రాండెడ్‌ పెర్ఫ్యూమ్‌లు వచ్చినప్పటికీ..దాని క్రేజ్‌కి సాటిలేదు ఏదీ..!.


ఇప్పటికీ విక్రయాల పరంగా ఎవర్‌ గ్రీన్‌ ఇదే. గంటకు వందలకొద్దీ బాటిళ్లు సేల్‌ అయిపోతాయట. అంతలా ప్రజాదరణ పొందిన ఈ పెర్ఫ్యూమ్‌ తయారీ వెనుకున్న గమ్మత్తైనా స్టోరీ చూస్తే..”ప్రేమ” గొప్ప ఆవిష్కరణాలకు దారితీస్తుందా..! అనిపిస్తుంది. మరీ ఆ పెర్ఫ్యూమ్‌ సృష్టికర్త..దాని తయారీకి ప్రేరేపించిన లవ్‌స్టోరీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.

ఆ పెర్ఫ్యూమ్‌ సృష్టికర్త ఫ్రెంచ్‌ పెర్ఫ్యూమర్‌ జాక్వెస్ గెర్లైన్‌. 1924లో దాన్ని తయారు చేశాడు. సువాసన పరిశ్రమలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ పెర్ఫ్యూమ్‌గా ఇది నిలిచింది. ఇప్పటికీ దాని అమ్మకాలు రికార్డు స్టాయిలోనే ఉంటాయట. ఎన్నెన్ని కొంగొత్త బ్రాండ్‌లు కూడా దానిముందు నిలవజాలవని అంటారు మార్కెట్‌ నిపుణులు.

జాక్వెస్‌ని ఈ పెర్ఫ్యూమ్‌ని తయారు చేసేలా ప్రేరేపించింది మొఘల్‌ చక్రవర్తి షాజహాన్ ప్రేమ కథ అట. పారిస్‌ మహారాజుని సందర్శించినప్పుడే జాక్వెస్‌కి​ షాజహాన్‌ లవ్‌స్టోరీ గురించి తెలిసిందట. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌కి తన భార్య ముంతాజ్‌ మహల్‌ అంటే ఎంతో ఇష్టమో తెలుసుకున్నాడట. ఆమె కోసమే షాలిమార్‌ గార్డెన్స్‌ని సృష్టించాడట.

ఇక్కడ షాలిమార్‌ అంటే అత్యంత సువాసనా భరితమైన ఉద్యానవనం అని అర్థం. ఆఖరికి ఆమె తన నుంచి దూరమైపోయిందని, ముంతాజ్‌ జ్ఞాపకార్థం తాజ్ మహల్‌ని కట్టించాడని తెలుసుకుని చలించిపోయాడట. షాజహాన్‌ ప్రేమ ఆ ఫ్రెంచ్‌ ఫెర్ఫ్యూమర్‌ని మనసును ఎంతగానో కదిలించిందట. అంతటి చక్రవర్తి గొప్ప ప్రేమను పొందిన మహారాజ్ఞీ ముంతాజ్ మహల్ గౌరవార్థం అత్యంత సువానభరితమైన సెంట్‌ని తయారుచేయాలని ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకున్నాడట.

అలా జాక్వెస్ పరిపూర్ణమైన సువాసన కోసం వెల్వెట్ వెనిల్లా, గంధం,రెసిన్ బెంజోయిన్, ఐరిస్, ప్యాచౌలి, ధూపం వంటి కలయికతో మనసును కట్టిపడేసే అద్భుతమైన పెర్ఫ్యూమ్‌ని తయారు చేశాడు. అయితే దాని బాటిల్‌ డిజైన్‌ కూడా అంతే అద్భుతంగా ఉండాలని భావించి అసాధారణమైన డిజైన్‌ని ఎంపిక చేసుకున్నాడు.

నీలిరంగు, ఫ్యాన్ ఆకారపు బాటిల్‌తో ఈ పెర్ఫ్యూమ్‌నీ తీసుకొచ్చాడు. ఈ బాటిల్‌ని బాకరట్ క్రిస్టల్‌తో తయారు చేశారట. అంతేగాదు ఈ పెర్ఫ్యూమ్‌ బాటిల్‌ డిజైన్‌ 1925లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ అలంకార కళల ప్రదర్శన అవార్డు(ఇంటర్నెషనల్‌ డెకరేషన్‌ అవారడు)ని గెలుచుకుంది. ఈ రోజు వరకు కూడా ఈ ఫెర్ఫ్యూమ్‌ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 108 బాటిళ్లు అమ్ముడయ్యే పెర్ఫ్యూమ్‌గా రికార్డులకెక్కింది.