Nagpur Temperature: నాగ్‌పుర్‌లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
నాగ్‌పుర్: దేశంలో వేసవి తీవ్రత (Heatwave) విపరీతంగా ఉంది. పలు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో గతంలో లేనంత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ (Nagpur)లో గల ఓ వాతావరణ స్టేషన్‌లో గురువారం ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీంతో ప్రజలు హడలిపోయారు. అయితే, అది నిజం కాదని ఆ తర్వాత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సర్ సరిగా పనిచేయడం లేదని స్పష్టతనిచ్చింది.
నాగ్‌పుర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ (AWS)ను ఏర్పాటుచేసింది. ఇందులో రెండింట గురువారం అసాధారణ ఉష్ణోగ్రతలు (Highest Temperature) చూపించాయి. సోనేగావ్‌లోని ఏడబ్ల్యూఎస్ స్టేషన్‌లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఎండలు ఉన్నట్లు రికార్డయ్యింది. దీంతో ఈ వార్త దేశమంతా వైరల్‌గా మారింది.