అర ఎకరంలో ఒకటి రెండు కాదు ఏకంగా 60 బోర్లు వేసి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. సాధారణంగా ఒక బోరు వేస్తే పక్క పొలంలో ఇంకొక బోరు వేసుకోవడానికి రైతులు అంగీకరించరు.
అలాంటిది ఐకమత్యంతో ఒకే చోట 60 బోర్లు వేసి వ్యవసాయం చేస్తూ.. ఐకమత్యంతో ఉంటే ఏది అయినా సాధ్యం అని అనంతపురం రైతులు నిరూపిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని మడుగుపల్లిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో దాన్ని నివారించేందుకు గ్రామప్రజలందరూ కలిసి సమీష్టి నిర్ణయం తీసుకున్నారు.
అందరూ సమీష్టిగా ఒకే చోట బోర్లు వేసుకొని భూఅంతర్భాగం నుంచి పైపుల ద్వారా పొలాలకు నీటిని చేరవేస్తూ కరువును నివారిస్తున్నారు. ఇప్పటికీ ఆ ఊరిలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా కొందరు రైతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరని, అయినా సరే వ్యవసాయం విషయంలో కలిసి మెలిసి ఉంటామని చెబుతున్నారు. గతంలో గుడి వద్ద 140 బోర్లు ఉండేవని అక్కడ నీరు తగ్గిపోవడంతో మరో చోట బోర్లు వేసుకున్నామని అంటున్నారు. ఇప్పుడు ఉన్న చోట అర ఎకరం భూమిలో 60 బోర్లు వేశామని, అవి నిరంతరం నీళ్లు అందించడంతో వ్యవసాయం చేసుకుంటున్నామని చెబుతున్నారు.