అన్నప్రాసన ఎందుకు చేయాలి..? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?

www.mannamweb.com


సంప్రదాయలకు పుట్టినిల్లు భారతదేశం. అందులోను హిందువులకు చాలా ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం, అన్నప్రాసన చేయడం ఇదంతా ఒక రకంగా సంప్రదాయం అయినప్పటికీ వీటి వెనుక కూడా సైన్స్‌ దాగి ఉంది. పిల్లలకు పుట్టెంటుకలు ఆరు నుంచి సంవత్సరం లోపల తీసేయాలి అంటారు. దానికి కారణం.. ఉమ్మనీరు తలకు అతుక్కోని ఉంటుంది.. అలానే జుట్టు ఎదిగితే బాక్టీరియా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా వెంట్రకలు తీస్తే అప్పటి నుంచి వచ్చే జుట్టు బాగుంటుంది. కానీ అన్నప్రాసన చేయడం వెనుక ఏంటి అర్థం..? అసలు ఎందుకు చేస్తారు..?

అన్నప్రాసన హిందు సంప్రదాయంలో కనిపించే ఒక పెద్ద కుటుంబ పండుగ. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయయని అంటున్నారు అర్చకులు. అయితే, ఈ కార్యక్రమం జరపడానికి శాస్త్రం సూచించిన నియమాలు పాటించాలి. అన్నప్రాసన ముహూర్త ప్రభావం శిశువు జీవితం, ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన తప్పకుండా మంచి ముహూర్తానికే అన్నప్రాశన చేయాలి. మగపిల్లలకు సరిమాసాలలో 6, 8, 10, 12 చేయాలి. ఆడపిల్లలకు బేసి మాసలలో 5, 7, 9, 11 చేయాలి.

లగ్న శుద్ధి, దశమ శుద్ధి వృషభ, మిధు, కటక, కన్య, ధనుస్సు, మీన రాసుల లగ్నములలో చేయాలి. ముందుగా గణపతి పూజ చేసి తర్వత విష్ణుమూర్తిని, సూర్య, చంద్రులను అష్టదిక్పాలకులను, కుల దేవతను భూదేవిని పూజించి కార్యక్రమం ప్రారంభించాలని అంటున్నారు అర్చకులు. ముందుగా శిశువును తల్లి లేదా మేనత్త ఒడిలో కుర్చోబెట్టుకోవాలి. బంగారం, వెండి, కంచు మొదలగు పాత్రలో ఏర్పాటు చేసుకున్న నెయ్యి, తేనె, పెరుగులను ముద్దగా తండ్రి లేక మేనమామ కుడిచేతిలో బంగారు ఉంగరాన్ని పట్టుకుని ఆ పాత్రలోని నెయ్యి, తేనె, పెరుగులను ఉంగరం సహయంతో శిశువునకు తినిపించాలట వసతి, స్థోమతలను బట్టి బంగారు లేక వెండి స్పూన్లను కూడా ఉపయోగిస్తారు. ఆ తర్వతనే అన్నం తినిపించాలి.

ఇలా మూడుసార్లు తినిపించిన తరువాత నాలుగోసారి చేతితో అన్నాన్ని తినిపిస్తారు. ఆ తరువాత తల్లి, మేనమామ మిగతా కుటుంబ పెద్దలు అదే పద్ధతిలో చేయాలి. అన్నప్రాశన సమయంలో దేవుని సన్నిధిలో బంగారునగలు, డబ్బు, పుస్తకము, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులు పెట్టి శిశువును ఈ వస్తువులకు దగ్గరగా కూర్చోబెడతారు. అమర్చిన వస్తువులలో శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకితే ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఉంటుందని భావన. ఇలా చేయడం వల్ల శిశువు ఆరోగ్యంతో పాటు పెరిగి పెద్దయ్యాక మంచి భవిష్యత్తు ఉంటుందని అర్చకులు అంటున్నారు.