65 ఏండ్లు దాటిన అంగన్‍వాడీలు ఇంటికి

www.mannamweb.com


Telangana News
65 ఏండ్లు నిండిన అంగన్​వాడీలను సర్వీస్​ నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీస్​ బెనిఫిట్స్​కింద టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు చెల్లించనుంది. అలాగే వారిని వృద్ధాప్య పింఛన్లకు అర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్​నెలాఖరు నాటికి 65 సంవత్సరాలు నిండిన అంగన్​వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్ల లిస్టులు పంపాలని విమెన్​డెవలప్​మెంట్​అండ్​చైల్డ్​వెల్ఫేర్​డిపార్ట్​మెంట్​జిల్లా సంక్షేమ అధికారులు (డీడబ్ల్యూవోలు)కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు అర్హులైన అంగన్​వాడీల లిస్టులను తయారు చేసి స్టేట్​ఆఫీస్​కు పంపుతున్నారు.

రాష్ర్టవ్యాప్తంగా 2వేల మందికి పైనే….
ఇప్పటివరకు అంగన్​వాడీలకు రిటైర్​మెంట్​ఏజ్​లిమిట్​లేదు. వయోభారంతో రిజైన్​ చేయడం, మరణించడం లేదా ఇతర కారణాలతో పోస్టులు ఖాళీ అయినప్పుడు కొత్తవారిని నియమించేవారు. ప్రస్తుతం 65 నుంచి 70 ఏండ్లు పైబడిన వారు కూడా అంగన్​వాడీలుగా కొనసాగుతున్నారు. పెద్దగా చదువు లేకపోవడం, వయోభారం కారణంగా మారిన విధానాలకు అనుగుణంగా విధులు నిర్వహించడానికి వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గత బీఆర్ఎస్​సర్కారు అంగన్​వాడీలకు 65 సంవత్సరాల ఏజ్​లిమిట్​తీసుకువచ్చింది. 2023 సెప్టెంబర్​5న సర్వీస్​డిస్​ఎంగేజ్​మెంట్​జీవో ఎంఎస్​ నంబర్​10 జారీ చేసింది. ఈ మేరకు అర్హులైన అంగన్​వాడీల లిస్టును పంపించాలని ఏప్రిల్​3న విమెన్​డెవలప్​మెంట్​అండ్​చైల్డ్​వెల్ఫేర్​డిపార్ట్​మెంట్​అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ర్టవ్యాప్తంగా 2వేల మందికి పైగా అంగన్​వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లు ఈ లిస్టులో ఉన్నట్టు సమాచారం. మంచిర్యాల జిల్లాలోనే దాదాపు 130 మంది ఉన్నారు.

సర్వీస్​ బెనిఫిట్స్​పెంచాలని డిమాండ్..
చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అంగన్​వాడీలు తమకు ఇచ్చే సర్వీస్​ బెనిఫిట్స్​పెంచాలని డిమాండ్​ చేస్తున్నారు. ప్రభుత్వం టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేల సర్వీస్​ బెనిఫిట్స్​తో పాటు వృద్ధాప్య పెన్షన్​ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, ఇంత తక్కువ మొత్తంతో తాము ఎట్లా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నెలవారీ జీతంతో జీవితాలు వెళ్లదీస్తున్నామని, ఇప్పుడు కొడుకులు, బిడ్డలకు భారం కావాల్సి వస్తుందని వాపోతున్నారు. ఏ ఆధారమూ లేనివారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5లక్షలు సర్వీస్​ బెనిఫిట్స్​చెల్లించాలని, శాలరీలో సగం పెన్షన్​ఇవ్వాలని, అర్హులైన వారసులకు ఉద్యోగావకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం టీచర్లకు రూ.13,500, హెల్పర్లకు రూ.8,600 జీతం ఇస్తున్నారు.

వయసు నిర్ధారణ కోసం టెస్టులు
అంగన్​వాడీల వయసు నిర్ధారణ విషయంలో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. చాలా ఏండ్ల కిందట నియమితులైన వారి దగ్గర వయసుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవు. గతంలో ఐదో తరగతి, ఏడో తరగతి అర్హతతోనే అంగన్​వాడీ టీచర్లను నియమించారు. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా హెల్పర్లను తీసుకున్నారు. అలాంటి వారి దగ్గర ఎడ్యుకేషనల్​క్వాలిఫికేషన్​సర్టిఫికెట్లు గానీ, డేట్​ఆఫ్​బర్త్​ సర్టిఫికెట్లు గానీ లేవు. ఆధార్​కార్డుల్లో కూడా అంచనా ప్రకారమే పుట్టిన తేదీ నమోదు చేశారు. చాలామంది ఇంకా తమకు 65 ఏండ్లు నిండలేదని పేర్కొంటున్నారు. దీంతో వయసు నిర్ధారణ కోసం బోన్​డెన్సిటోమెట్రీ టెస్టులు చేయించాలని ప్రభుత్వం సూచించింది. కలెక్టర్​పర్మిషన్​తో డిస్ర్టిక్ట్​ హాస్పిటల్స్​లో ఈ టెస్టులు చేయించనున్నట్టు అధికారులు తెలిపారు.