భార్య టీడీపీ.. నేను వైఎస్సార్‌సీపీలోనే…న్యాయ పోరాటం చేస్తా

www.mannamweb.com


భార్య టీడీపీలో చేరితే తనను ఎమ్మెల్సీ పదవిలో నుంచి తొలగించడం అన్యాయమని ఇందుకూరి రఘరాజు అన్నారు. ఏ తప్పు చేయకున్నా శాసనమండలి చైర్మన్‌ తనను అన్యాయంగా పదవీచ్యుతుడిని చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు.

విజయనగరంలోని ఓ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ముందు రోజు నాలుగో నోటీసు ఇచ్చి డిస్మిస్‌ చేశారని, గతంలో మూడు నోటీసులు వచ్చిన సందర్భంలో పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదని ముందుగా స్పందించలేదన్నారు. షెడ్యూల్‌ 10 కింద డిస్మిస్‌ చేసినట్టు నోటీసులు ఇచ్చారని, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం నేనేమీ పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. ఎస్‌.కోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేసిన వ్యవహారాలు నచ్చక పోవడంతో పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తను ఏ పార్టీలో చేరలేదని, ఏ పార్టీ కోసం పని చేయలేదన్నారు. భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి (సుధారాజు) టీడీపీలో చేరారని, టీడీపీ వాళ్లతో నేను టచ్‌లో ఉన్నానని కారణాలు చూపి సస్పెండ్‌ చేశారని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన సమయంలో కొన్ని కారణాల వల్ల హాజరుకాలేక సమయం కోరినప్పటికీ తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. తనకు పదవులు అంటే ఆసక్తి లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తనను పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఇప్పటికీ తను వైఎస్సార్‌సీపీలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తనను బాధించిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఎస్‌.కోట నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశానని చెప్పారు.

మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

అన్యాయంగా ఎమ్మెల్సీ పదవి నుంచి

తొలగించారు

న్యాయం కోసం పోరాటం చేస్తా