ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ కు చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించింది. ఆయన తీరుపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం మారగానే ప్రస్తుత ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు.
తనకు ఎలాగూ పోస్టింగ్ రాదు కాబట్టి .. వీఆర్ఎస్ తీసుకుంటానని బెదిరించడం ప్రారంభించారు. మొదట ఓ చిన్న తెల్ల కాగితంపై రాసి.. అదే తన వీఆర్ఎస్ విజ్ఞాపన పత్రంగా పరిగణించాలని చెప్పారు. కానీ సీఎస్ కార్యాలయం ఫార్మాట్‌లో ఇవ్వాలని అడగడంతో ఈ సారి డిజిటల్ సిగ్నేచర్ కాపీ చేసి ఇచ్చారు. కానీ అలా కూడా సంతకం పెట్టి ఇవ్వాల్సిందేనని వెంటపడటంతో అదే విధంగా ఇచ్చారు. చివరికి ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది.
గతంలో కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నించారు. కానీ ఆయనను తీసుకోలేదు. భవిష్యత్ లో తీసుకునే అవకాశాలు లేవు., ఆయన అంత చెడ్డపేరు తెచ్చుకున్నారు. అందుకే తనపై రకరకాల పుకార్లు పుట్టించుకుంటూ ఉంటారు. మొదట జగన్ దగ్గర బాగా చేరి ఆయన చెప్పినట్లుగా చేసి సీఎంవోను తానే నడిపించారు. తన కంటే పదకొండేళ్లు సీనియర్ అయిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసింది ప్రవీణ్ ప్రకాషే. తర్వాత జగన్ కు కూడా చిరాకు పుట్టిందేమో కానీ ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పంపారు. అప్పట్లో తాను వీఆర్ఎస్ తీసుకుని యూపీ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రచారం చేయించుకున్నారు. దీంతో జగన మళ్లీ ఏపీకి పిలిపించి టీచర్లను వేధించే పోస్టు ఇచ్చారు.
విద్యాశాఖలో వైసీపీ నేతల దోపిడీకి ఆయన చేసిన సాయం అంతా ఇంతా కాదు. చిక్కీల ఆర్డర్ దగ్గర నుంచి ఐబీ కరికులం పేరుతో చేసిన స్కాం వరకూ ప్రతీ దాంట్లోనూ ప్రవీణ్ ప్రకాష్ హస్తం ఉంది. విద్యార్థుల ఫీజుల డబ్బులు… ఇండియా టుడేకు ఐదు కోట్లు ధారబోసింది కూడా ప్రవీణ్ ప్రకాషే. జగన్ కోసం ఆయన అన్ని రకాల రూల్స్ ఉల్లంఘించారు. ఇప్పుడు దొరికిపోవడం ఖాయమని వీఆర్ఎస్ తీసుకున్నారు. కానీ ప్రభుత్వం 30 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ లోపు ఆయన చేసిన గూడుపుఠాణి మొత్తం బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి.