ఇంట్లో బ్రెడ్ ఉందా? ఇన్స్టంట్‌గా బ్రెడ్ ఊతప్పం చేసేయండిలా

www.mannamweb.com


ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు చాలా సింపుల్ గా ఈ బ్రెడ్ ఊతప్పం తయారు చేయొచ్చు. దీనికోసం తక్కువ పదార్థాలే అవసరం అవుతాయి. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూడండి.

అప్పటికప్పుడు ఏదైనా అల్పాహారం చేయాలంటే ఈ బ్రెడ్ ఊతప్పం బెస్ట్ ఆప్షన్. ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు వీటిని సింపుల్ గా చేసేయొచ్చు. పిండి కూడా పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. ఈ బ్రెడ్ ఊతప్పం అల్పాహారంలోకి, స్నాక్స్ లోకి బాగుంటాయి.

బ్రెడ్ ఊతప్పం తయారీకి కావాల్సినవి:

6 బ్రెడ్ స్లైసులు

సగం కప్పు సన్నం రవ్వ

సగం కప్పు పెరుగు

2 చెంచాల బియ్యం పిండి

2 ఉల్లిపాయల సన్నటి ముక్కల తరుగు

1 టమాటా సన్నటి ముక్కల తరుగు

అరచెంచా అల్లం తరుగు

గుప్పెడు జీడిపప్పు సన్నం ముక్కలు

1 క్యారట్ తురుము

గుప్పెడు కొత్తిమీర తరుగు

అరచెంచాడు ఉప్పు

2 చెంచాల నెయ్యి లేదా నూనె

బ్రెడ్ ఊతప్పం తయారీ విధానం:

ముందుగా బ్రెడ్ చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పట్టుకోవాలి. అందులోనే రవ్వ, బియ్యం పిండి కూడా వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టాలి.
అన్నీ కలిసేలా ముద్దలాగా అయ్యేలా కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, అల్లం తరుగు, జీడిపప్పు ముక్కలు వేసుకోండి.
మరిన్ని నీళ్లు పోసుకుని పిండి బాగా కలుపుకోండి. మరీ ముద్దలాగా పిండి ఉండకూడదు.
ఇప్పుడు పెనం పెట్టుకుని వేడెక్కాక నెయ్యి రాసుకుని ఒక గరిటెడు పిండి పోసుకుని కాస్త వెడల్పుగా గుండ్రంగా అనేయండి. ఇవి ఊతప్పం కాబట్టి కాస్త మందంగానే ఉండాలి.
అంచుల వెంబడి నూనె వేసుకుని బాగా కాల్చుకోండి. మీడియం మంట మీద మరో వైపు కూడా కాల్చుకుంటే బ్రెడ్ ఊతప్పం రెడీ అవుతుంది.