పోషకాహార లోపాన్ని తీర్చే మల్టీ సీడ్స్ లడ్డూ, రోజుకు ఒకటి తింటే చాలు ఇదిగో రెసిపి

www.mannamweb.com


పోషకాహార లోపంతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి ఈ మల్టీ సీడ్స్ లడ్డు ఉపశమనాన్ని ఇస్తుంది. రెసిపీ తెలుసుకోండి.

ఆధునిక కాలంలో పోషకాహార లోపం పెరిగిపోతుంది. పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్ లో ఎలాంటి పోషకాలు లేకపోవడంతో ఇప్పటి యువతలో పోషకాహార లోపం ఎక్కువగా ఉంటోంది. అందుకే ప్రతిరోజూ మల్టీ సీడ్స్ లడ్డు ఒకటి తింటే చాలు. మీలో ఎలాంటి పోషకాలు లోపించకుండా ఉంటాయి. ఇక్కడ మేము మల్టీ సీడ్స్ లడ్డు రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు. ముఖ్యంగా మహిళలు పిల్లలు కచ్చితంగా దీన్ని తినాలి. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మల్టీ సీడ్స్ లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు

అవిసె గింజలు – రెండు స్పూన్లు

గుమ్మడి గింజలు – రెండు స్పూన్లు

సన్ ఫ్లవర్ సీడ్స్ – రెండు స్పూన్లు

నువ్వులు – రెండు స్పూన్లు

ఓట్స్ – పావు కప్పు

ఖర్జూరాలు – పది

యాలకుల పొడి – చిటికెడు

నెయ్యి- ఒక స్పూను
మల్టీ సీడ్స్ లడ్డూ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు, ఓట్స్ వంటివన్నీ కూడా వేయించుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

2. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యిని వేయాలి.

3. ఆ నెయ్యిలో ఖర్జూరాలను సన్నగా తరిగి వేయించుకోవాలి.

4. ఆ ఖర్జూరం మిశ్రమంలోనే ముందుగా రుబ్బి పెట్టుకున్న పొడిని కూడా వేసి బాగా కలపాలి.

5. అలాగే యాలకుల పొడిని కూడా వేయాలి.

6. ఈ మొత్తం మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం మిశ్రమాన్ని చల్లార్చాలి.

7. ఇప్పుడు ఈ మిశ్రమంలో అవసరమైతే కొంచెం నెయ్యిని వేసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి.

8. అంతే టేస్టీ మల్టీ సీడ్స్ లడ్డు రెడీ అయినట్టే.

9. వీటిని సీసాలో ఉంచి మూత పెట్టాలి. ప్రతిరోజూ ఒకటి తింటే చాలు, మీ శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి.

మల్టీ సీడ్స్ లడ్డు రెసిపీలో మనం అవిస గింజలను వాడాము. ఇందులో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచే గుణాలు ఉన్నాయి. అవిసె గింజలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోమని కూడా చెబుతారు. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ తో పోరాడుతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే ఖర్జూరాన్ని కూడా ఎక్కువగానే వినియోగించాము. ఈ ఖర్జూరంలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

ఖర్జూరంలో ఇనుము కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ఖర్జురాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఉత్తమం. ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగే గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, నువ్వుల్లో కూడా ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి. కాబట్టి మల్టీ సీడ్స్ లడ్డును కచ్చితంగా మహిళలు పిల్లలు తినేందుకు ప్రయత్నించాలి.