రైతులకు గుడ్‌న్యూస్‌.. కొత్త ఏడాది నుంచే తాకట్టు లేకుండా ₹2 లక్షల రుణం

www.mannamweb.com


వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా.. ఇటీవల దాన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా స్పష్టంచేసింది.

పంటల సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్‌బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది. 2004లో కేవలం రూ.10 వేలే ఉంది. క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. సాధారణంగా భూ యజమానుల నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరుచేయాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలుకావడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకొని అప్పులపాలవుతున్నారు. అలాంటివారికి అండగా ఉండేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ సదుపాయం కల్పిస్తోంది.

జొమాటోకు పోటీగా స్విగ్గీ కొత్త యాప్‌.. డైనింగ్‌, లైవ్‌ ఈవెంట్లు కోసం ప్రత్యేక అప్లికేషన్‌
వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు రుణ సదుపాయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ చర్య ద్వారా చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరనుందని పేర్కొంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వేగంగా అమలుచేయాలని, కొత్త రుణ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకులకు సూచించింది. వ్యవసాయ రంగంలో రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, వారికి అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించేందుకు ఇదొక వ్యూహాత్మక చర్యగా అభివర్ణించింది.