విడుదలకు ముందు నుంచే సరికొత్త రికార్డులు సృష్టించి, రిలీజ్ తర్వాత అంతకుమించి జోరు ప్రదర్శిస్తోంది ‘పుష్ప 2’ (Pushpa 2). ఇప్పటికే పలు రికార్డులతో హవా కొనసాగిస్తున్న ఆ చిత్రం తాజాగా మరో అరుదైన ఫీట్ సాధించింది. హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా నిలిచింది. రూ.632 కోట్లు కలెక్ట్ (Pushpa 2 Hindi Collections) చేసి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. విడుదలైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం మరో విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్) (Pushpa 2 World Wide Collections) వసూలు చేసింది.
విడుదలైన 6 రోజుల్లోనే ఈ సినిమా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో నయా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ‘కేజీయఫ్2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (రూ.1,387 కోట్లు) ఆల్టైమ్ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా దూసుకెళ్తోంది.
ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు చిత్ర బృందం మరికొన్ని సన్నివేశాలు జత చేయనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయా సీన్ల రన్టైమ్ దాదాపు 20 నిమిషాలు ఉండనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 20 నిమిషాలున్న సంగతి తెలిసిందే.