పవన్‌ మాటలకు కన్నీళ్లు వచ్చేశాయి: దిల్‌ రాజు

www.mannamweb.com


నటుడు, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pwan kalyan) తనకు స్ఫూర్తి అని నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) తెలిపారు. ఆయన్ని చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.

తాను నిర్మించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్‌ సక్సెస్‌ కావడానికి ఆయనే కారణం అని అన్నారు. ఆ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ మాటలు విని తాను భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.

”పవన్‌ కల్యాణ్‌ను నేను ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా చూస్తుంటా. ‘తొలిప్రేమ’ నుంచి ఆయనతో నా ప్రయాణం మొదలైంది. దాదాపు 25 ఏళ్ల ప్రయాణం మాది. కెరీర్‌ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారని చాలామంది మాట్లాడుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని. రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే ఆయనేమీ విజయాన్ని అందుకోలేదు. పరాజయం వచ్చినా ఆయన ఎక్కడా ఆగలేదు. ఎంతో శ్రమించారు. ఇటీవల 21 సీట్లకు 21 గెలుచుకొని ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయనే నిజమైన గేమ్‌ ఛేంజర్‌. సక్సెస్‌ రాలేదని, ఎక్కడా ఆగకూడదని శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన్ని చూశాకే అర్థమైంది. వకీల్‌సాబ్‌ సినిమా వల్ల వచ్చిన పారితోషికం తమ పార్టీకి ఒక ఇంధనంగా పనిచేసిందని ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన నా గురించి చెప్పిన మాటలు విని నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఆయన ఆ విషయాన్ని చెబుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకొని ఆవిధంగా మాట్లాడటం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకు నా పాదాభివందనం” అని దిల్‌ రాజు అన్నారు.

తెలంగాణలో టికెట్‌ రేట్లు..:

సినిమా పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాకు చెప్పారు. అయితే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని ఆయన సూచించారు. ఫార్మా, ఐటీ, సినిమా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని ఆయన ఇటీవల మాతో అన్నారు. ఒక నిర్మాతగా త్వరలోనే ఆయన్ని కలిసి టికెట్‌ రేట్ల గురించి మాట్లాడతాను. తుది నిర్ణయం ప్రభుత్వానిదే. ఎలాంటి సమాధానం వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.

ఇదే నా కమ్‌బ్యాక్‌..:

గేమ్‌ ఛేంజర్‌తో నేను తప్పకుండా కమ్‌బ్యాక్‌ ఇస్తానని అనుకుంటున్నా. మా బ్యానర్‌పై నిర్మితమైన మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఆ సినిమా విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నా. ఆ సినిమా పూర్తి క్రెడిట్‌ అనిల్‌ రావిపూడికే చెందుతుంది.

వారధిగా పనిచేస్తా..:

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినందుకు ఆనందంగా ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సంయుక్తంగా వర్క్‌ చేస్తాను. చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాను. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతాను.

దానికి మేమేం చేయలేం..:

నాలుగేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఇందులోని సన్నివేశాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు రాజకీయ సంఘటనలను ప్రతిబింబిస్తాయి. అవి తమకు చెందినవి అని ఎవరైనా ఆపాదించుకుంటే మేము ఏమీ చేయలేం. ఈ సన్నివేశాలు, పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావని మేము సినిమా ముందు డిస్క్లైమర్‌ వేస్తున్నాం.

వారికి ఆర్థికసాయం..:

‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్‌ నుంచి తిరిగివెళ్తున్న సమయంలో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. వారి కుటుంబాలకు అండగా ఉంటా. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తా” అని దిల్‌ రాజు తెలిపారు.