లాక్​ వేసిన రూమ్​ ఫ్రిడ్జ్​లో 10 నెలలుగా మహిళ మృతదేహం- సహజీవనం పేరుతో దారుణం!

www.mannamweb.com


మధ్యప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! 10నెలల క్రితం హత్యకు గురైన ఓ మహిళ మృతదేహం.. తాజాగా ఒక రూమ్​లోని ఫ్రీడ్జ్​లో నుంచి బయటపడింది.

ఈ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

మధ్యప్రదేశ్​ దివాస్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సంజయ్​ పటిదార్​ అనే వ్యక్తి గతేడాది జూన్​లో ఓ ఇంటి నుంచి మరో ఇంటికి షిప్ట్​ అయ్యాడు. కానీ పాత ఇంటిలోని ఒక రూమ్​ని ఇంకా వాడుకుంటున్నాడు. ఆ రూమ్​కి ఎప్పుడూ లాక్​ వేసే ఉంటుంది.

ఆ ఇంట్లో మరికొందరు అద్దెకు ఉంటున్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం నాటికి, లాక్​ వేసిన రూమ్​ నుంచి దుర్వాసన రావడం మొదలైంది. బల్వీర్​ రాజ్​పుట్​ అనే వ్యక్తి.. రూమ్​ డోర్​ని బద్దలుకొట్టి, లోపలికి వెళ్లాడు. ఫ్రిడ్జ్​ డోర్​ తీసిన తర్వాత షాక్​కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు.. ఆ రూమ్​ ఫ్రిడ్జ్​లో ఒక మహిళ మృతదేహం కనిపించింది.

“రూమ్​ నుంచి దుర్వాసన వస్తోందని చెబితే వెళ్లాము. ఆ రూమ్​లో ఒక మృతదేహం కనిపించింది,” అని దివాస్​ ఎస్​పీ పునీత్​ గెహ్లోత్​ తెలిపారు.

చనిపోయిన మహిళ పేరు ప్రతిభా పటీదార్​ అని, సంజయ్​ పటీదార్​తో ఆమె లివ్​-ఇన్​ రిలేషన్​లో ఉండేదని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆ మహిళను గతేడాది మార్చ్​లో చంపినట్టు తెలిసిందని వివరించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సంజయ్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి 40 కి.మీల దూరంలోని ఉజ్జెయిన్​లో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

“సంజయ్​ 2024 జూన్​లో ఇంటిని ఖాళీ చేసి, ఆ రూమ్​ని మాత్రమే ఉంచుకున్నాడు. బల్వీర్​ రాజ్​పుట్​ అనే వ్యక్తి ఈ ఇంట్లోకి 2024 జులైలో వచ్చాడు. అంతకుముందు, ఆ మహిళ- సంజయ్​లు ఇక్కడ సహజీవనంలో ఉండేవారు. కాగా, మహిళ చాలా రోజులుగా కనిపించకుండాపోయిందని స్థానికులు తెలిపారు. మహిళ రెండు చేతులను కట్టేసి ఫ్రిడ్జ్​లో పడేశాడు,​” గెహ్లోత్​ తెలిపారు.

పోలీసుల ప్రకారం.. మహిళతో లివ్​-ఇన్​లో ఉన్నట్టు సంజయ్​ ఒప్పుకున్నాడు. ఆమెతో కలిసి 2023లో ఆ ఇంట్లోకి షిఫ్ట్​ అయ్యాడు. కానీ ఇరుగుపొరుగు వారికి మాత్రం, తమకు పెళ్లి జరిగిందని అబద్ధం చెప్పాడు.

కాగా, 2024 జనవరిలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకుందామని సంజయ్​పై ప్రతిభ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దానికి అతను ఒప్పుకోలేదు. ఈ విషయంపై తరచూ గొడవ జరిగేది.

గొడవలను తట్టుకోలేకపోయిన సంజయ్​.. ప్రతిభను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు వినోద్​ దేవ్​కి ఈ విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి గతేడాది మార్చ్​లో మహిళ గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఫ్రిడ్జ్​లో పెట్టారు.

ఆ తర్వాత గతేడాది జూన్​లో సంజయ్​ ఇంటిని ఖాళీ చేశాడు. కానీ కొన్ని వస్తువులు ఉన్నాయని, ఆ రూమ్​ కీని తన దగ్గరే పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు వచ్చి రూమ్​ తెరిచి చూసేవాడు.

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.