ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో ‘కల్కి 2’ గురించి మాట్లాడారు. అలాగే తన అల్లుడు, డైరెక్టర్ నాగ్అశ్విన్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘‘కల్కి 2’ వచ్చే ఏడాది విడుదలవుతుంది. రెండో పార్ట్ మొత్తం కమల్‌హాసనే ఉంటారు. ప్రభాస్ (Prabhas), కమల్ హాసన్‌ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కొత్త వాళ్లు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’’ అని అన్నారు.
ఇక నాగ్అశ్విన్ గురించి అశ్వనీదత్ (Ashwini Dutt) మాట్లాడుతూ.. మంచి దర్శకుడని కొనియాడారు. ‘‘మహానటి’ సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్ పూర్తి చేశాడు. తర్వాత ‘కల్కి’ రూపొందించాడు. రెండూ సూపర్ హిట్‌గా నిలిచాయి. నాగ్ అశ్విన్‌కు జీవితంలో ఓటమనేది ఉండదని నేను నమ్ముతాను. అతడి ఆలోచనా విధానం, సినిమాలను తెరకెక్కించే తీరు చాలా గొప్పగా ఉంటాయి’’ అని చెప్పారు.
వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, కమల్ హాసన్.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు.