బ్యాంకు ఉద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ అందనుంది. ఇక నుంచి బ్యాంకులు వారంలో ఐదు రోజులే పనిచేసేందుకు మార్గం క్లియర్ అవుతోంది.
ప్రతి శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. అదనపు పని గంటల్ని రాత్రి వేళ నిర్వహించేందుకు ఆర్బీఐ యోచిస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్యాంకులు వారంలో ఆరు రోజులు పనిచేస్తున్నాయి. నెలలో రెండు వారాలు మాత్రం ఐదు రోజులు పని జరుగుతోంది. అంటే మరో రెండ్రోజులే అదనంగా సెలవు కావల్సి ఉంటుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న విధంగా 5 డే వీక్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక నుంచి అంటే ఏప్రిల్ నుంచి బ్యాంకులు వారంలో ఐదు రోజులే పనిచేయనున్నాయి. ఇకపై 1, 3 శనివారాలు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. దాంతో మొత్తం అన్ని శనివారాల్లో బ్యాంకులు పనిచేయకపోవచ్చు.
ఇది అమల్లోకి వస్తే ఏప్రిల్ నెల నుంచి బ్యాంకు పనివేళలు మారవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకే బ్యాంకులు పనిచేయనున్నాయి. కార్పొరేట్ ఆఫీసులకు ఉన్నట్టే బ్యాంకులు 5 రోజులు పనిచేస్తాయి. రెండ్రోజులు సెలవు ఉంటుంది. వాస్తవానికి 5 డే వీక్ కోసం బ్యాంకు ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. చివరికి ఉద్యోగుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే దశలో ఉందని సమాచారం. ఇది అమల్లోకి వస్తే మీరు బ్యాంకు పనులు ఉంటే శనివారం ప్లాన్ చేసుకోవద్దు. వారంలో మొదటి ఐదు రోజులే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే శనివారాలు సెలవు ఇస్తే కోల్పోయే పని గంటల్ని భర్తీ చేసేందుకు బ్యాంకుల్ని రెండు షిఫ్టుల్లో తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే రాత్రి వేళ కూడా బ్యాంకులు లావాదేవీలు నిర్వహిస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షిఫ్టు, మద్యాహ్నం నుంచి రాత్రి వరకు మరో షిఫ్టు ప్రతిపాదన అమల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.