“వడలు” నూనె తాగేసి ఉబ్బిపోతున్నాయా? – పప్పులో ఇదొక్కటి కలిపితే చాలు – అస్సలు పీల్చుకోవు

మెజార్టీ పీపుల్​ ఫేవరెట్​ బ్రేక్​ఫాస్ట్​ రెసిపీ “వడ”. కేవలం టిఫెన్​గా మాత్రమే కాకుండా పూజలు, వ్రతాలు, పండగల సమయంలో కూడా వీటిని ఎక్కువగా ప్రిపేర్​ చేస్తుంటారు. అయితే బయట హోటల్స్​లో తయారు చేసే వాటితో పోలిస్తే ఇంట్లో చేసే వడలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. పైగా కొన్నిసార్లు లోపల పిండి కూడా ఉడకదు. అలాంటప్పుడు ఈ టిప్స్​ పాటిస్తే వడలు టేస్టీగా ప్రిపేర్​ చేసుకోవడమే కాదు, నూనె కూడా అస్సలు పీల్చవు. మరి లేట్​ చేయకుండా వడలను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.


కావాల్సిన పదార్థాలు:
మినప గుళ్లు – 1 కప్పు
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
బియ్యం – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 3
అల్లం – చిన్న ముక్క
కొత్తిమీర – కొద్దిగా
కరివేపాకు – కొద్దిగా
పచ్చి కొబ్బరి తురుము – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 1 చిన్నది
జీలకర్ర – 1/2 టీ స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
వంట సోడా – చిటికెడు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి తగినంత

తయారీ విధానం:

ఒక గిన్నెలో మినపగుళ్లు, శనగపప్పు, బియ్యం వేసి బాగా కడగాలి. ఆ తర్వాత నీళ్లు పోసి కనీసం 4 గంటలు నానబెట్టాలి. ఉదయాన్నే చేసుకోవాలనుకుంటే రాత్రి మొత్తం నానబెడితే సరిపోతుంది.
ఇందులో ఉపయోగించే శనగపప్పు నూనె పీల్చకుండా, బియ్యం వడలు క్రిస్పీగా రావడానికి యూజ్​ అవుతాయి.
పప్పులు నానిన తర్వాత మిక్సీ జార్ లేదా గ్రైండర్​లో వేసి మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. పిండి గట్టిగానే ఉండాలి. ఎక్కువ నీళ్లు వేస్తే వడలు సరిగ్గా రావు, నూనె పీల్చుకుంటాయి.
రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయ, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి.
పిండిని 5 నిమిషాలు బాగా కలపడం వల్ల అది ప్లఫ్పీగా తయారవుతుంది. చివరగా చిటికెడు వంట సోడా వేసి కలపాలి. పిండి సరిగ్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పిండిని నీళ్లలో వేస్తే అది వెంటనే పైకి తేలాలి. తేలకపోతే మరో 2-3 నిమిషాలు కలపాలి.
స్టవ్ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం ఫ్లేమ్‌లో వేడి చేయండి. నూనె బాగా వేడెక్కాలి.
చేతిని నీళ్లతో తడి చేసుకుంటూ, పిండిని కొద్దిగా తీసుకొని వడలుగా వత్తుకుని కాగుతున్న నూనెలో వేయండి. అలా పాన్​కు సరిపడే వడలు వేసుకోవాలి.
వడలు ఒకవైపు రంగు మారిన తర్వాత నెమ్మదిగా తిప్పి రెండోవైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వడలను మీడియం ఫ్లేమ్​లో వేయించడం వల్ల లోపల కూడా బాగా ఉడికి, క్రిస్పీగా వస్తాయి.
వడలు రెండు వైపులా బాగా వేగిన తర్వాత వాటిని తీసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసుకోండి. ఇది అదనపు నూనెను పీల్చుకుంటుంది. ఇలా పిండి మొత్తాన్ని వడలుగా వేసుకుని నచ్చిన చట్నీతో సర్వ్​ చేసుకుంటే సరి.
టిప్స్​:

మినప వడలకు నూనె పట్టకుండా ఉండాలంటే మినపగుళ్లతో పాటు 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా వేయాలి.
మినపప్పులో ఉండే అధిక తేమను కొంతవరకు శనగపప్పు గ్రహించి, వడలు నూనెలో వేసినప్పుడు ఎక్కువ నూనె పీల్చకుండా సహాయపడుతుంది.
నూనె పట్టకుండా ఉండటానికి ఎక్కువ నీరు వేయకుండా పిండిని రుబ్బుకోవడం కూడా ముఖ్యమే.
ఒకవేళ పిండి కొంచెం లూస్‌గా అనిపిస్తే, 4 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తర్వాత వడలు వేసుకుంటే సరి.