ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ప్రధాన డిమాండ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 20 నెలలుగా తమ సమస్యలపై దృష్టి సారించడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పండుగల సమయంలో ఉద్యోగులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మంత్రివర్గ ఉప సంఘం, అధికారుల కమిటీతో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై కదలిక వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వం ఆహ్వానం మేరకు హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమ పెండింగ్‌ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించారు. కరువు భత్యం, పీఆర్‌సీ, పెండింగ్‌ బకాయిలు, బిల్లుల బకాయిలపై ప్రభుత్వంతో చర్చించినట్లు సమాచారం.

పెండింగ్ సమస్యల పరిష్కారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు చర్చించగా.. కీలక అంశం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారుల కమిటీతో ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ప్రతి అంశంపై సానుకూలమైన వైఖరితో చర్చలు జరిగాయని జేఏసీ నాయకులు తెలిపారు. తాము ఎప్పటినుంచో కోరుతున్న నగదు రహిత చికిత్స కోసం హెల్త్ కార్డులు మంజూరుచేస్తామని.. దీనికోసం విధి విధానాలతో ఉత్తర్వులు జారీ చేస్తామని కచ్చితమైన హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ.700 నుంచి రూ.750 కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామని, నర్సింగ్ డైరెక్టరేట్‌ని కూడా త్వరలో ఏరాటుచేస్తామని ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించారు. విజిలెన్స్‌, ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు రెండేళ్లకుపైగా సస్పెన్షన్‌లో ఉన్నవారికి క్రమంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వం వేరువేరు కాదని ప్రకటించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.