పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చల్లని సాయంత్రం వేళ కరకరలాడే పకోడీని వేడివేడి టీ లేదా కాఫీ తాగుతూ తింటుంటే ఆ కిక్కే వేరు. అందుకే మెజార్టీ పీపుల్ వీలున్నప్పుడల్లా ఆనియన్ పకోడీ చేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ రొటీన్ వంటలు ఏం బాగుంటాయి. అందుకే కాస్త వెరైటీగా ఉండేలా కాకరకాయ పకోడీ చేసుకోండి.
ఏంటీ..? కాకరకాయ కూర తినడమే కష్టమనుకుంటే, పకోడీలు అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా? కానీ మీరు విన్నది నిజమే. కాకరకాయతో ఎంతో రుచికరంగా కరకరలాడే పకోడీలు చేసుకోవచ్చు. అస్సలు చేదు లేకుండా ఉంటాయి. పిల్లలు సైతం ఇష్టంగా తింటుంటారు.
కావాల్సిన పదార్థాలు:
- కాకరకాయలు – అర కేజీ
- ఉప్పు – రుచికి సరిపడా
- శనగపిండి – 2 టేబుల్‌స్పూన్లు
- బియ్యప్పిండి – 2 టేబుల్‌స్పూన్లు
- కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్‌స్పూన్లు
- కారం -1 టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
- జీలకర్ర పొడి – అర టీస్పూన్
- వాము – పావు టీస్పూన్
- పసుపు – పావు టీస్పూన్
- పచ్చిమిర్చి – 2
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- కరివేపాకు – 3 రెమ్మలు
తయారీ విధానం:
- ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చివర్లు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కాకరకాయ సైజ్‌ను బట్టి రెండు లేదా మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ భాగాన్ని తీసుకుని మధ్యకు కట్ చేసుకోవాలి. ఒకవేళ అందులో ముదిరిన గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. లేతవి ఉంటే అవసరం లేదు.
- ఆ తర్వాత పొడుగ్గా, సన్నగా కట్ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన కాకరకాయ ముక్కలన్నింటినీ ఇలానే కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోవాలి.
- కాకరకాయ ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు అంతా కలిసేలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
- ఈలోపు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన ఉంచాలి.
- 10 నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలను చేతితో గట్టిగా పిండి మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో నుంచి రసం బయటికి వస్తుంది. దీంతో కాకరకాయ ముక్కలు చేదుగా ఉండవు.
- ఇలా అన్ని ముక్కల్లోనుంచి రసం తీసేసి గిన్నెలోకి వేసుకోవాలి. ఆపై అందులోకి శనగపిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, వాము, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి చుక్క నీళ్లు కూడా లేకుండా పదార్థాలు అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- పకోడీ వేసుకునేందుకు సరిపడేలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రుచి చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మరికొంచెం వేసుకుని యాడ్ చేసుకోవచ్చు. పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఏమైనా జారుగా అనిపిస్తే మరికొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి. కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ నూనెలో వేసుకోవాలి.
- కడాయికి తగ్గట్టుగా వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చిల్లుల్ల గరిటెతో రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- అవి మంచిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరి. ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ పకోడీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

































