వేలిముద్ర ఆధారంగా గతం, భవిష్యత్ తెలుపుతున్నారు.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలో వేల సంవత్సరాల కింద నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల నిర్మాణ సమయంలో అప్పటి రాజులు, మునులు ప్రత్యేకతలను ఏర్పాటు చేశారు.


అందుకే ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆలయాలు పురాతనమైనవి మాత్రమే కాకుండా ఎన్నో రహస్యాలను కలిగి ఉన్నాయి. వాటిలో మైలాడుతురై జిల్లాలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఆలయంలో ఒక మనిషి గతం, భవిష్యత్తు గురించి చెబుతూ ఉంటారు. కేవలం వేలిముద్ర ఆధారంగా ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్రను తెలియజేయడంతో దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి చాలామంది ఇక్కడికి తరలివస్తున్నారు. ఇంతకీ ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు? అలా చెప్పడానికి కారణం ఎవరు?

పురాణ కథ ప్రకారం.. నవగ్రహాల్లో ఒకటైన అంగారకుడు ఒకసారి కుష్టు వ్యాధితో బాధపడ్డాడు. ఈ సమయంలో శివుడు వైద్యుడి అవతారంలో వచ్చి అంగారకుడికి చికిత్స చేస్తాడు. దీంతో అతడు వ్యాధి నుంచి విముక్తి పొందుతాడు. అందుకే ఈ ఆలయానికి వైదీశ్వరన్ కోయిల్ అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని కుజుడికి సంబంధించిన ఆలయంగా కూడా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న శివుడిని ఆరాధించడం వల్ల అన్ని రకాల శారీరక, మానసిక వ్యాధులు దూరమవుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే దీనిని వైద్య క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇచ్చే తీర్థాన్ని సిద్ధామృత తీర్థం అంటారు. ఒక పవిత్ర కొలను నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని.. వాటి నుంచి తెచ్చిన నీటినే తీర్థ ప్రసాదంగా ఇస్తారని భక్తులు చెప్పుకుంటారు.

వైదీశ్వరన్ కోయిల్ ఆలయం గురించి మరో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఆలయంలో నాడీ జ్యోతిష్యం గురించి ఎక్కువగా ప్రచారం ఉంది. ఈ నాడీ జ్యోతిష్యంలో ఒక వ్యక్తి జాతకాన్ని పూర్తిగా చెప్పేస్తారు. ఆ వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు అడగకుండానే కేవలం తన బొటనవేలి ముద్రతో తన గురించి చెప్పేస్తారు. పురుషులకు కుడి బొటనవేలు.. స్త్రీలకు ఎడమ బొటనవేలు ఆధారంగా నాడి పత్రాలను తెలుసుకుంటారు. వేల సంవత్సరాల కింద సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహాముని మరికొందరి ఋషులతో కలిసి తన దివ్యదృష్టితో రాబోయే యుగాల గురించి.. భూమిపై ఉండే ప్రతి వ్యక్తి ఏం చేస్తాడో అనే విషయాన్ని తెలుసుకున్నాడు.. ఆ విషయాలను తమ అంచనాలను తాటి పత్రాలపై రచించినట్లు చెబుతారు. ఈ రచనలు అన్ని తమిళంలోనే ఉంటాయి. ఈ గ్రంథాలలో ఒక వ్యక్తి యొక్క జన్మ కర్మలు, ప్రస్తుత జీవితంలో అనుభవించాల్సిన సమస్యలకు పరిష్కారాలు, మోక్షమార్గాలు కూడా వివరించబడ్డాయి.

అయితే వేలిముద్ర ఆధారంగా ఎలా తెలుసుకోగలుగుతున్నారు అన్న సందేహం చాలామందికి వస్తుంది. ప్రతి బొటనవేలి ముద్ర లో కొన్ని వందల వర్గాలుగా విభజించబడి ఉంటుంది. ఆ వర్గానికి సంబంధించిన తాళపత్రాల కట్టలను వారు పరిశీలిస్తారు. ఆ పత్రం ఆధారంగా ఆ వ్యక్తి పేరు, వైవాహిక స్థితి, వృత్తి వంటి వివరాలను ప్రశ్నిస్తారు. ఒకవేళ అవి సరి పోల్చితే.. వాటి ఆధారంగా ఆ వ్యక్తి జీవితాన్ని గురించి చెప్పగలుగుతారు. అయితే చాలామంది ఈ విషయం తెలుసుకోవడానికి విదేశాల నుంచి కూడా వస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.