త్వరలోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ టెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అయితే చాలా మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం సన్నద్ధమవుతుండగా… నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
త్వరలోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. గతేడాదిలోనే మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి అయిన సంగతి తెలిసిందే.15 వేల మందికిపైగా అభ్యర్థులకు నియామకపత్రాలను కూడా అందజేశారు. ప్రస్తుతం వారంతా కూడా విధుల్లో చేరారు. ఇదిలా ఉండగా… మిగిలిపోయిన పోస్టులతో పాటు రిటైర్మెంట్ ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇదే విషయంపై కసరత్తు చేస్తోంది.
గతేడాది రిక్రూట్ చేసిన మెగా డీఎస్సీలో భాగంగా దాదాపు 400కుపైగా పోస్టులు మిగిలాయి. వీటితో పాటు కొత్తగా ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి డీఎస్సీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు అన్ని జిల్లాల నుంచి కూడా విద్యాశాఖ వివరాలను సేకరిస్తోంది. అయితే వచ్చే వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో…. పక్కాగా ఖాళీల లెక్కలు తీసుకొని డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమయ్యే పనిలో ఉంది.
ఇప్పటికే ఏపీ టెట్ ఫలితాలు కూడా వచ్చాయి. దీంతో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. పైగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్… గతేడాది అక్టోబర్ లో ఓ ప్రకటన కూడా చేశారు. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రకటించారు. దీంతో చాలా మంది టీచర్ ఉద్యోగ అభ్యర్థులు… డీఎస్సీపై ఆశలు పెంచుకున్నారు.
అన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఖాళీలపై ఓ క్లారిటీకి రానున్నారు. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ కనుక జారీ అయితే… మార్చి, ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. మరోవైపు స్పెషల్ డీఎస్సీలో 2,260 పోస్టులకు ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి లభించింది.ఈ పోస్టుల భర్తీపై కూడా విద్యాశాఖ ఫోకస్ పెట్టింది.
వచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు తీసుకువచ్చే విషయాన్ని కూడా ఏపీ విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఇంగ్లీష్ ఫ్రొఫిషియెన్సీ టెస్టుతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టులు కూడా నిర్వహించాలని యోచిస్తోంది.
కొద్ది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిక్రూట్ అయ్యే టీచర్లకు కూడా ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది.
డీఎస్సీలో భాగంగా ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. తద్వారా పిల్లలకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం బోధనలో ఇబ్బందులు రాకుండా ఉండటమే కాకుండా… పాఠశాల స్థాయిలోనే పిల్లలకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించవచ్చని విద్యాశాఖ లెక్కలు వేస్తోంది. దీనిపై నోటిఫికేషన్ లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.


































