బాలికపై హత్యాచారం.. చెరువులో నిందితుడు కులవర్ధన్‌ మృతదేహం

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని మదనపల్లెలో బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన కేసు నిందితుడు కులవర్ధన్‌గా నిర్ధారించారు. చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కులవర్ధన్‌ ఎలా చనిపోయాడన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.


ఏం జరిగిందంటే..
స్థానికులు, బాధితులు తెలిపిన మేరకు.. మదనపల్లె పట్టణానికి చెందిన ఓ బాలిక (7) రెండో తరగతి చదువుతోంది. సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉంది. పనికి వెళ్లిన ఆమె తల్లి సాయంత్రం 4.30 గంటలకు ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్‌ చేసి పాప గురించి అడగ్గా, చిన్నారి ఇంట్లో లేదని తెలిపారు. స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోడానికి వెళ్లిందేమో అని మొదట భావించారు. ఎంతసేపటికీ రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు మొదలుపెట్టారు. స్థానికంగా వాట్సప్‌ గ్రూపుల్లో బాలిక ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోస్టు చేశారు.

ఎదురింట్లోనే మృగాడు!
బాలిక ఎదురింట్లో ఉంటున్న కులవర్ధన్‌ (30)కు నేర చరిత్ర ఉందని తెలియడంతో రాత్రి 1.30 గంటలకు పోలీసులు అతడి ఇంట్లో గాలించడానికి వెళ్లారు. తలుపు కొట్టినా తీయకపోవడంతో కానిస్టేబుళ్లు కిటికీలోంచి చూశారు. కులవర్ధన్‌ పడుకుని కనిపించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాలిక చివరిసారిగా కుల వర్ధన్‌తోనే కనిపించిందని ఆమె తాత చెప్పడంతో మంగళవారం ఉదయం 7 గంటలకు మళ్లీ అతడి ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.