ఎప్‌స్టీన్‌ రహస్యం… ఆమె ఛేదించారు!

ఒకరిద్దరు కాదు. వందలు, వేల మంది బాలికలు, యువతులు… పేదరికం, కుటుంబ నిరాదరణ, మోడలింగ్‌ ఆసక్తులు… పలు కారణాలతో ఎప్‌స్టీన్‌ అనే సంపన్న కామాంధుడి వలకి చిక్కారు, సెక్స్‌ ట్రాఫికింగ్‌కి బలయ్యారు. ఆ చీకటి సాలెగూడు నుంచి బయటపడిన కొందరమ్మాయిల కథలు వింటే… ఎలాంటి సమాజంలో ఉన్నాం, మృగాళ్ల నుంచి ఆడపిల్లలను ఎంత జాగ్రత్తగా రక్షించుకోవాలి.


 

ఒకరిద్దరు కాదు. వందలు, వేల మంది బాలికలు, యువతులు… పేదరికం, కుటుంబ నిరాదరణ, మోడలింగ్‌ ఆసక్తులు… పలు కారణాలతో ఎప్‌స్టీన్‌ అనే సంపన్న కామాంధుడి వలకి చిక్కారు, సెక్స్‌ ట్రాఫికింగ్‌కి బలయ్యారు. ఆ చీకటి సాలెగూడు నుంచి బయటపడిన కొందరమ్మాయిల కథలు వింటే… ఎలాంటి సమాజంలో ఉన్నాం, మృగాళ్ల నుంచి ఆడపిల్లలను ఎంత జాగ్రత్తగా రక్షించుకోవాలి… అన్నదాన్ని తెలియజేస్తున్నాయి.

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌… జుగుప్సాకరమైన ఈ ఇంటర్నేషనల్‌ సెక్స్‌ ట్రాఫికింగ్‌ స్కామ్‌ సెగ ఇప్పుడు మనదేశాన్నీ తాకింది. ఆ వికృత కామక్రీడకు బలైనవాళ్లలో మనదేశ బాలిక పేరూ ఉండటంతో మరోసారి దీనిమీద చర్చ మొదలైంది. అయితే, కొన్నేళ్ల కిందటి ఎప్‌స్టీన్‌ కేసును తిరగదీసి, 2019లో అతనికి జైలుశిక్ష పడటంలో మయామీ హెరాల్డ్‌ పత్రికకు చెందిన మహిళా ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ కీలకపాత్ర పోషించారు. పేరు జూలీ కె.బ్రౌన్‌. 80 మంది బాధితుల్ని కలిశారీమె. వాళ్ల కథల్నీ ఎప్‌స్టీన్‌ అరాచక వ్యవస్థనీ సిరీస్‌గా ప్రచురించారు. ఆ కథనాల్ని ‘పర్వర్షన్‌ ఆఫ్‌ జస్టిస్‌’ పేరుతో పుస్తకంగానూ తీసుకొచ్చారు అసలు ఎప్‌స్టీన్‌ కేసు శోధించాలన్న ఆలోచన ఆమెలో ఎలా మొదలైందన్నది తెలుసుకునే ముందు….

 

జెఫ్రీ ఎప్‌స్టీన్‌… అమెరికన్‌ ఫైనాన్షియర్‌. బాలికలు, యువతుల జీవితాలతో ఆడుకున్న కామపిశాచి. దేశాధినేతలు, వ్యాపారులు, మేధావులతో పరిచయాలు పెంచుకుని అపర కుబేరుడిగా ఎదిగాడు. అసాంఘిక, అశ్లీల సామ్రాజ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. ప్రైవేటు దీవుల్ని కొని, ఇంద్ర భవనాలు నిర్మించి, అనేక దేశాల నుంచి అమ్మాయిల్ని రప్పించి పార్టీలు ఇచ్చేవాడు. ఫ్లోరిడాలోని తన పామ్‌బీచ్‌ నివాసంలో 14 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించాడని 2005లో అతనిమీద కేసు నమోదైంది. దర్యాప్తుకోసం వెళ్లిన పోలీసులు న్యూడ్‌ పెయింటింగులతో నిండిన ఆ ఇంటి గోడల్ని చూసి నివ్వెరపోయారు. చివరకు ఎప్‌స్టీన్‌ నేరాన్ని ఒప్పుకోవడంతో 2008లో జైలుశిక్ష పడింది. డబ్బు బలంతో నాన్‌ ప్రాసిక్యూషన్‌ (ప్లీ డీల్‌)ఒప్పందం చేసుకున్నాడు. ఫలితం తేలికపాటి జైలుశిక్ష పడగా 13 నెలలకే విడుదల య్యాడు. జైల్లోనూ రాచమర్యాదలే. నిజానికి అతనిమీద మోపిన నేరానికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష పడాలి. కానీ అలా జరగలేదు. ఇదే బ్రౌన్‌లో ఆసక్తిని రేకెత్తించింది. ఎవరితను… ప్లీ డీల్‌ ఎలా పొందాడు… అనుకుంటూ అతనిపై ఓ కన్నేసి ఉంచారీమె!

ఎలా శోధించారు?
కేసు విచారణకు సంబంధించిన లీగల్‌ డాక్యుమెంట్లను 2017లో క్షుణ్ణంగా పరిశీలించారు బ్రౌన్‌. వాటిల్లో బాధితుల పేర్లకు బదులుగా జేన్‌డో1, జేన్‌డో2… అని రాస్తారు. కానీ వాటి ద్వారానే 80 మంది బాధితుల వివరాలు సేకరించి వాళ్లని కలిశారు. అందుకామె చాలా కష్టపడ్డారు. ఎంతో దూరాలు ప్రయాణించేవారు. చాలామంది భయంతో నోరు విప్పేవారు కాదు. ఎనిమిది మంది అమ్మాయిలు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి ఎప్‌స్టీన్‌ వికృతచేష్టల్నీ, తమమీద జరిగిన అకృత్యాల్నీ వినిపించారు. దాదాపుగా అందరిదీ ఒకటే కథ. ఫీజులకోసం కొందరూ కార్పొరేట్‌ టౌన్‌ పార్టీల ఆశతో ఇంకొందరూ అతని గాలానికి చిక్కినవాళ్లే. డ్రగ్స్‌కి బానిసైన బాలికల్నీ చేరదీసేవారు. వీళ్లని వెతికి తెచ్చే పని ఎప్‌స్టీన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గిస్లైన్‌ మ్యాక్స్‌వెల్‌ది… తన స్నేహితుడు గొప్ప దాత అనీ, ఫీజులు కట్టి సాయం చేస్తాడనీ, మసాజ్‌ చేస్తే చాలనీ, 200 డాలర్ల చొప్పున ఇస్తామని తీసుకెళ్లేది. అక్కడ వాళ్లమీద అఘాయిత్యం చేయడమే కాదు, ఆ దృశ్యాలను రహస్య కెమెరాల్లో చిత్రించి, భయపెట్టి లొంగదీసుకునేవారు. వాళ్ల స్నేహితుల్నీ తీసుకొస్తే డబ్బులిస్తామనీ ఆ అమ్మాయిలకే ఆశ చూపించేవారు. ఒకమ్మాయి పాతిక మందినీ మరొకమ్మాయి నలభై మందినీ ఎప్‌స్టీన్‌కి పరిచయం చేశారట. ఇలా ఎప్‌స్టీన్‌ కామానికి బలైన బాలికలెందరో. ఆ నరకం నుంచి బయటికొచ్చి వాళ్లు చెప్పేవి వినడానికే సమాజం సిగ్గుపడుతుందంటే… ఆ అమ్మాయిలెంత నరకం అనుభవించి ఉంటారు? పైగా వాళ్లను న్యాయ విచారణలో ప్రశ్నలతో హింసించారు, జీతంకోసం పనిచేసే వేశ్యలుగా చిత్రించారు ఎప్‌స్టీన్‌ న్యాయవాదులు.

వాళ్లందరినీ కలిసిన బ్రౌన్‌… 2018లో ఆ అమ్మాయిలు ఎదుర్కొన్న లైంగిక హింస గురించి సిరీస్‌గా ప్రచురించారు. అప్పటి అటార్నీ జనరల్‌ అలెగ్జాండర్‌ అకోస్టా మధ్యవర్తిత్వం వహించిన 2008 నాటి¨ నాన్‌ ప్రాసిక్యూషన్‌ ఒప్పందమే అతనికి తేలికపాటి శిక్ష పడటానికి కారణమన్న విషయాన్ని ఆమె బహిర్గతం చేశారు. ట్రాఫికింగ్‌ నెట్‌వర్క్‌ ఆరోపణలు, మీటూ ఉద్యమం ఊపందుకోవడం, బ్రౌన్‌ కథనాలతో న్యూయార్క్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూషన్‌ ఎప్‌స్టీన్‌ కేసును తిరగదీసింది. దర్యాప్తు మళ్లీ ప్రారంభమైంది. ప్లీ డీల్‌ బాధితుల హక్కులను ఉల్లంఘించిందనీ, ట్రాఫికింగ్‌ జరిగిందనీ.. అన్న ఆరోపణలతో జులై 6, 2019న ఎప్‌స్టీన్‌ను న్యూయార్క్‌లో అరెస్ట్‌ చేశారు. తరవాత కొన్ని రోజులకే అకోస్టా యూఎస్‌ కార్మిక కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 10న విచారణకోసం ఎదురుచూస్తూ జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు ఎప్‌స్టీన్‌.

ఎవరీ జూలీ కె. బ్రౌన్‌?
బ్రౌన్‌ స్వస్థలం ఫిలడెల్ఫియా.. చిన్నతనం నుంచీ ఎన్నో కష్టాలు పడ్డారు. ఒంటరి తల్లి పెంపకంలో పెరిగారు. చుట్టుపక్కల, స్కూల్లో అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నారు. పరిశోధనాత్మక కథనాలమీద ఆసక్తితో స్కూలు వార్తాపత్రికకి ఎడిటర్‌గా పనిచేశారు బ్రౌన్‌. పదహారేళ్ల వయసులో బయటి ప్రపంచంలోకి వచ్చి సొంత జీవితాన్ని ప్రారంభించారు. కాలేజీ ఫీజులకోసం కొరియర్‌గా, ఫ్యాక్టరీలో వర్కర్‌గా ఎన్నో పనులు చేశారు. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఫిలడెల్ఫియా డెయిలీ న్యూస్‌లో కొంతకాలం చేశాక మయామీ హెరాల్డ్‌కి వచ్చారు. ఓ దశలో ఉద్యోగం పోతుందనే అనుకున్నారట. కానీ యాజమాన్యం మద్దతు లభించడంతో ఆమె ధైర్యంగా తన కథనాలను ప్రచురించారు.

ఈ ఒక్క కేసే కాదు, దీనికి ముందు జైళ్ల అరాచక వ్యవస్థపై నాలుగేళ్లపాటు శోధించి, కథనాలు రాశారు బ్రౌన్‌. అవి అధికారుల రాజీనామాలకూ అవినీతిపరుల తొలగింపునకీ దారితీశాయి. 30 ఏళ్ల కెరియర్‌లో రెండుసార్లు ప్రసిద్ధ జార్జ్‌ పోల్క్‌ అవార్డుతోపాటు మరెన్నో పురస్కారాల్నీ అందుకున్నారు. పులిట్జర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న మయామీ టీమ్‌లో ఈమె ఒకరు. 2020లో టైమ్‌ మ్యాగజీన్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ జాబితాలోనూ చేరారు. ఎప్‌స్టీన్‌ అరెస్ట్‌తో అంతా ఆమె ధైర్యాన్నీ తెగువనీ ప్రశంసించారు. అప్పుడు ‘భయాన్ని పక్కనబెట్టి తమ కథలను కెమెరా ముందు చెప్పిన ధైర్యవంతులైన బాధితులే రియల్‌ హీరోలు’ అన్నారీమె. అంతేకాదు, ‘వాళ్లు తమకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంటే సమాజం ఎంతగా కుళ్లిపోయిందో తెలుస్తోంది. పిల్లల్ని రక్షించాల్సిన బాధ్యత మనదే. అలాంటిది ఎంతోమంది టీనేజర్లు బలైన ఈ ఘోర నేరాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే… వాళ్లకి ఏమని సమాధానం చెబుతాం?’ అంటోన్న బ్రౌన్‌ పట్టుదల, వృత్తి పట్ల ఉన్న నిబద్ధత అభినందనీయం!

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.