భారతదేశం ప్రపంచ స్థాయిలోనే అత్యంత భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో సాగుతుంది. ఆభరణాల తయారీ, భారీ పెట్టుబడులు, పండుగలు, వివాహాల రూపంలో డిమాండ్ విపరీతంగా ఉండటంతో విదేశీ మార్కెట్లపై ఆధారపడటం తప్పనిసరి. ఏటా దీపావళి వంటి పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో ఈ దిగుమతులు గరిష్ట స్థాయికి చేరుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు ఈ దిగుమతి పరిమాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
భారతదేశానికి బంగారం ప్రధానంగా ఏ దేశాల నుండి వస్తుందనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ప్రపంచ స్థాయిలో బంగారం శుద్ధి, వ్యాపారం చేసే కొన్ని దేశాలు భారతదేశానికి పెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన దేశం స్విట్జర్లాండ్. అక్కడ అత్యాధునిక శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. అధిక నాణ్యత గల స్వచ్ఛమైన బంగారం అందుబాటులో ఉంటుంది. 2024లో స్విట్జర్లాండ్ నుండి భారతదేశం సుమారు 19.6 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి చేసుకుంది.
రెండవ ప్రధాన సరఫరా దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ముఖ్యంగా దుబాయ్ ప్రపంచ వ్యాప్తంగా బంగారం వ్యాపారానికి కేంద్రంగా ఉంది. 2024లో UAE నుండి సుమారు 16.1 బిలియన్ డాలర్ల విలువైన బంగారం భారత్కు చేరింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఉండటంతో దిగుమతులు సులభంగా జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో ఇతర దేశాల నుండి వచ్చిన బంగారం అక్కడ శుద్ధి చేయబడి భారత్కు చేరుతుంది. దక్షిణాఫ్రికా కూడా బంగారం విషయంలో చాలా కీలకమైన దేశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ దేశం బంగారు గనులకు ప్రసిద్ధి. 2024లో అక్కడి నుండి సుమారు 6.35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం భారత్కు వచ్చింది. ఆస్ట్రేలియా కూడా కొంతమేర సరఫరా చేస్తోంది. కొన్నిసార్లు పెరూ వంటి దేశాలు కూడా సరఫరా జాబితాలో చోటు దక్కించుకుంటాయి.
ఇటీవలి కాలంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గులు చూపుతున్నాయి. ధరలు వేగంగా పెరగడంతో వినియోగదారులు కొనుగోలు విషయంలో వెనుకంజ వేస్తున్నారు. కొన్ని వారాల క్రితం 10 గ్రాముల ధర రూ.1.33 లక్షలుగా ఉండగా, అది రూ.1.54 లక్షలకు చేరడం సాధారణ ప్రజలను అయోమయంలోకి నెట్టింది. ధరలు పెరగడం వల్ల ఆభరణాల కొనుగోలు మందగించింది. ఆభరణాల తయారీదారులు తయారీ ఛార్జీలపై డిస్కౌంట్లు ఇస్తున్నా స్పందన తక్కువగా ఉంది. పెరిగిన ధర వద్ద పెట్టుబడి పెట్టడం లాభదాయకం కాదని కొంతమంది భావిస్తున్నారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో కూడా అమ్మకాలు మందగించినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
దేశీయ వ్యాపారులు అధికారిక ధరలపై ఔన్సుకు 12 డాలర్ల వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం విధించిన 6 శాతం దిగుమతి సుంకం, 3 శాతం అమ్మకపు పన్ను కూడా ఉన్నాయి. గతంలో ప్రీమియం వసూలు చేసిన వ్యాపారులు ఇప్పుడు నిల్వలు పెరగడంతో తగ్గింపులు ఇవ్వాల్సి వస్తోంది. విదేశీ మార్కెట్ల ప్రభావం దేశీయ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలి నెలల్లో బంగారం ధరలు బలమైన ర్యాలీ చూపాయి. దీర్ఘకాలంలో ధరలు మరింత పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026 చివరి నాటికి ఔన్స్ ధర 6,000 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి, కేంద్ర బ్యాంకులు నిల్వలు పెంచడం వంటి అంశాలు ధరలకు మద్దతు ఇస్తున్నాయి. దీని అంచనా ప్రకారం త్వరలోనే తులం బంగారం ధర రూ.3,00,000లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది.
మార్కెట్ వర్గాల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత తగ్గుదల తాత్కాలికం మాత్రమే. పెట్టుబడిదారులు లాభాలను స్థిరపరచుకోవడం వల్ల కొంత ఒత్తిడి కనిపిస్తోంది. అయినా సురక్షిత పెట్టుబడిగా బంగారం స్థానం మారదు. ఆర్థిక అనిశ్చితి సమయంలో ప్రజలు విశ్వసించే ప్రధాన ఆస్తిగా బంగారం కొనసాగుతోంది.

































