‘ఘోస్ట్‌ ఉద్యోగి’కి.. వేతన రూపంలో రూ.10 కోట్లు!

అమెరికాలో ఓ భారత సంతతి వ్యక్తి చేసిన మోసం వెలుగు చూసింది. తప్పుడు పత్రాలతో తన స్నేహితుడిని నియమించుకొని సంస్థకు 1.2 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10 కోట్లు) మేర నష్టం కలిగించినట్లు తేలింది. పని చేయకున్నా వేతనంతోపాటు ఇతర సదుపాయాలు పొందడం గమనార్హం. ‘ఘోస్ట్‌ ఉద్యోగి’ (Ghost Employee) వ్యవహారంపై దర్యాప్తు జరిపిన న్యాయస్థానం.. అతడు అధికార దుర్వినియోగంతో సంస్థను మోసం చేసినట్లు నిర్ధరించింది.


భారత సంతతికి చెందిన కరణ్‌ గుప్తా.. మిన్నెసోటా రాష్ట్రంలో ఉన్న యునైటెడ్‌హెల్త్‌ గ్రూప్‌లో పనిచేసేవాడు. దానికి అనుబంధ సంస్థ ‘ఆప్టమ్‌’లో డేటా అనలటిక్స్‌ విభాగానికి సీనియర్‌ డైరెక్టర్‌గా చేశాడు. అతడి వార్షిక వేతనం 2.60లక్షల డాలర్ల కంటే ఎక్కువే. ఈ క్రమంలో కొన్నేళ్లక్రితం తన చిరకాల మిత్రుడిని ఆ సంస్థలో చేర్చుకోవాలని భావించాడు. అతడికి అర్హత లేకున్నా తప్పుడు దస్త్రాలు (రెజ్యూమె సహా ఇతర) సృష్టించి 2015లో ఉద్యోగిగా నియమించుకున్నాడు. తన టీమ్‌లోనే పనిచేసేలా కేటాయించుకున్నాడు.

అతడి మిత్రుడు సంస్థలో పనిచేయకున్నా ప్రారంభంలో లక్ష డాలర్లకుపైగా వార్షిక వేతనం అందుకున్నాడు. ప్రతి ఏటా జీతం పెంపుతో పాటు బోనస్‌లను కూడా పొందాడు. ఉద్యోగిగా వేతనం పొందుతున్నప్పటికీ ఆ సంస్థలో ఒక్క సహోద్యోగినీ కలవలేదు. ఆయనకు సంబంధించి ఒక్క మెయిల్‌ లేదు. అసలు అతనికి కేటాయించిన కంప్యూటర్‌లో లాగిన్‌ కూడా కాలేదు. అయితే, అతడి స్నేహితుడికి వచ్చే జీతంలో సగానికిపైగా గుప్తా ఖాతాలోకి చేరేవి. న్యూజెర్సీలో ఉండే ఆ స్నేహితుడు నగదు విత్‌డ్రా చేసి గుప్తా అకౌంట్‌లో వేసేవాడు.

అయితే, 2019 నవంబర్‌లో ఓ మోసం కేసులో గుప్తాను ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. అదే సమయంలో ఈ వ్యవహారం బయటపడింది. సంస్థ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థలు.. మొత్తంగా దాదాపు 1.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10 కోట్లు) మోసం చేయడంతోపాటు, మనీలాండరింగ్‌ కుట్ర ఉన్నట్లు పేర్కొన్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడిన గుప్తా.. ఘోస్ట్‌ ఉద్యోగిని నియమించుకొని సంస్థను మోసగించినట్లు న్యాయస్థానం నిర్ధరించింది. ఈ వ్యవహారానికి సంబంధించి న్యాయశాఖ పూర్తి వివరాలు వెల్లడించింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.