ఐటీ శాఖకు రెస్టారెంట్ల బురిడీ.. రూ.70 వేల కోట్ల విక్రయ లావాదేవీల పన్ను ఎగవేత

దేశంలో మరో భారీ స్కామ్‌ బట్టబయలైంది. ఆదాయ పన్ను (ఐటీ) శాఖను రెస్టారెంట్లు బురిడీ కొట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది మరి. ఆరేండ్లుగా జరుగుతున్న ఈ మోసాన్ని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో ఐటీ అధికారులు పట్టుకోగలిగారు. అయితే ఈ భారీ పన్ను ఎగవేత రాకెట్‌లో బిల్లుల్ని తొలగించడంలో తెలంగాణలోని రెస్టారెంట్లు రెండో స్థానంలో ఉండటం గమనార్హం.


దేశంలో మరో భారీ స్కామ్‌ బట్టబయలైంది. ఆదాయ పన్ను (ఐటీ) శాఖను రెస్టారెంట్లు బురిడీ కొట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది మరి. ఆరేండ్లుగా జరుగుతున్న ఈ మోసాన్ని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో ఐటీ అధికారులు పట్టుకోగలిగారు. అయితే ఈ భారీ పన్ను ఎగవేత రాకెట్‌లో బిల్లుల్ని తొలగించడంలో తెలంగాణలోని రెస్టారెంట్లు రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఇక ఓ మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ సాయంతో 25% లావాదేవీలను కప్పిపుచ్చి ఆదాయపు పన్ను శాఖకు నష్టాలు చూపుతున్నట్టు వెల్లడైంది. ఇప్పటివరకు 5 రాష్ర్టాల్లో దర్యాప్తు పూర్తవగా.. రాష్ట్రంలోని రెస్టారెంట్లు సుమారు రూ.1,500 కోట్ల మేర బిల్లులను రికార్డుల్లో నుంచి తొలగించినట్టు అధికారులు తేల్చారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని విస్తుపోయే అంశాలు వెలుగుచూసే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్‌లోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో ఐటీ శాఖ సాధారణ దాడులు నిర్వహించగా, దేశవ్యాప్తంగా పన్ను ఎగవేత బాగోతాలు బయటపడ్డాయి. ఆయా రెస్టారెంట్లు 2019-20 నుంచి ఇప్పటివరకు రూ.70,000 కోట్ల విలువైన విక్రయాలను రహస్యంగా దాచిపెట్టినట్టు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ప్రముఖ పాన్‌ ఇండియా బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా రెస్టారెంట్లు తమ టర్నోవర్‌ను ఐటీ అధికారుల దృష్టిలో పడకుండా కప్పిపుచ్చాయని తేలింది.

2019-20 ఆర్థిక సంవత్సరం నుంచే..
ఐటీ చట్టంలోని సెక్షన్‌ 133-ఏ కింద నిర్వహించిన దర్యాప్తులో భాగంగా 2019-20 నుంచి 2025-26 వరకు జరిగిన దాదాపు 60 టెరాబైట్ల లావాదేవీల డాటాను అధికారులు విశ్లేషించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 1.77 లక్షల రెస్టారెంట్లు వాడుతున్నట్టు, ఇది దేశంలోని దాదాపు 10% రెస్టారెంట్లకు సమానమని అధికారులు కనిపెట్టారు. ఈ రెస్టారెంట్లలో గడిచిన ఆరేండ్లలో రూ.2.43 లక్షల కోట్ల విలువైన బిల్లింగ్‌ జరిగినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన డాటాను ఏఐ సాయంతో పరిశీలించగా, బిల్లింగ్‌ తర్వాత రూ.13,317 కోట్లకు సమానమైన డాటాను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్టు వెల్లడైంది. ఇలా మరికొన్ని రకాలుగా మొత్తం దాదాపు రూ.70 వేల కోట్ల లావాదేవీలకు సంబంధించిన డాటాను ఘరానా రెస్టారెంట్‌ యాజమాన్యాలు మాయంచేసి ఆ మేరకు పన్ను ఎగబెట్టారని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నగదు లావాదేవీలను తొలగించి..
హోటళ్లు, రెస్టారెంట్లు తమ వార్షిక టర్నోవర్‌ను తక్కువగా చూపేందుకు బహుళ పద్ధతులను అనుసరించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. బ్యాంక్‌ కార్డు, యూపీఐ వంటి చెల్లింపులను యథాతథంగా ఉంచి, నగదు చెల్లింపుల్లోనే ఈ అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. నగదు లావాదేవీలకు సంబంధించిన రికార్డులను సాఫ్ట్‌వేర్‌ నుంచి తీసేశారని, కొన్ని రెస్టారెంట్లు కొన్నిరోజుల తరబడి నగదు చెల్లింపులే జరగలేదనట్టుగా చూపించినట్టు దర్యాప్తులో తేలింది. తద్వారా లాభాలను దాచేసి నష్టాల్లో ఉన్నట్టుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులను తప్పుదోవ పట్టించినట్టు తేలింది.

రెండో స్థానంలో మన రెస్టారెంట్లు
రెస్టారెంట్ల పన్ను ఎగవేతను ప్రాథమికంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ర్టాల్లో గుర్తించిన అధికారులు, ఆయా రాష్ర్టాల్లోని రెస్టారెంట్లలో భారీగా అవకతవకలకు పాల్పడినట్టు తేల్చారు. బిల్లింగ్‌ రికార్డుల తొలగింపుల్లో దాదాపు రూ.2,000 కోట్లతో కర్ణాటక రాష్ట్రం టాప్‌లో ఉండగా, రూ.1,500 కోట్లతో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్టు అధికారిక వర్గాల సమాచారం. రూ.1,200 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నది. రెస్టారెంట్ల పన్ను ఎగవేతపై తొలుత హైదరాబాద్‌లోనే సోదాలు మొదలుకావడం గమనార్హం. ఆ తర్వాత ఏపీలోని విశాఖపట్నంలో, అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లలో సోదాలు నిర్వహించగా, నివ్వెరపోయే అతిపెద్ద కుంభకోణం బయటపడింది. ఇప్పటివరకు బయటపడ్డ డేటా ఆధారంగా హోటళ్లు, రెస్టారెంట్లలో జరిగే అమ్మకాల్లో 25% లెక్కలోకి రావడం లేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతున్నదని, భవిష్యత్తులో ఆశ్చర్యపోయే లెక్కలే బయటపడవచ్చునని తెలుస్తున్నది.

ఖజానాకు జీఎస్టీ గండి
హైదరాబాద్‌లో ఒక బిర్యానీ ప్లేటు బిల్లు దగ్గర మొదలైన తనిఖీ.. దేశ ఆర్థిక మూలాలను కదిలించే రూ.70 వేల కోట్ల మహా కుంభకోణాన్ని బయటపెట్టింది. నకిలీ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ), కాగితాలకే పరిమితమైన లారీలు, అదృశ్యమైన షెల్‌ కంపెనీలతో సాగుతున్న ఈ ట్యాక్స్‌ దందా రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ చర్చల్లోకి వచ్చింది. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి జీఎస్టీ ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్రంలో ఏడాదికి సగటున సుమారు రూ.3,000 నుంచి 5,000 కోట్ల వరకు, దేశవ్యాప్తంగా ఏటా సుమారు రూ.1.5 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు పన్ను ఎగవేతల వల్ల ఆదాయం కోల్పోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత అడ్డూ అదుపులేకుండా ఈ పన్ను ఎగవేత కొనసాగుతున్నది. గత రెండేండ్లలో ఇలాంటి భారీ జీఎస్టీ ఎగవేత కుంభకోణాలు అనేకం వెలుగులోకి రావడమే ఇందుకు నిదర్శనం.

అక్రమారుల అస్త్రం నకిలీ ఐటీసీ
జీఎస్టీ వ్యవస్థలో నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) అతిపెద్ద లూప్‌ హోల్‌గా మారింది. వస్తువు కొనకుండానే కొన్నట్టు బిల్లులు సృష్టించి, ప్రభుత్వం నుంచి పన్ను వాపసు పొందడమే ఈ సామ్‌ ఉద్దేశం. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది నెలలకే.. అంటే 2024 మార్చిలో వాణిజ్య పన్నుల శాఖ రూ.1,000 కోట్ల భారీ జీఎస్టీ రీఫండ్‌ సామ్‌ను గుర్తించింది. తెలంగాణలో సుమారు 52 కంపెనీలు ఫేక్‌ ఇన్‌వాయిస్‌లు సృష్టించి, తప్పుడు ఐటీసీ ద్వారా పన్ను రీఫండ్‌లు పొందాయి. ఈ సామ్‌లో ఐఐటీ-హైదరాబాద్‌ రూపొందించిన డాటా సాఫ్ట్‌వేర్‌నే అక్రమారులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు, డాటాను మాస్‌ చేసి అధికారుల కంటపడకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు అధికారులు గుర్తించారు.

జీరో దందాతో రూ.3,000 కోట్ల స్కామ్‌
బిర్యానీ రెస్టారెంట్ల కేసుకు దగ్గరగా ఉండే మరో పెద్ద సామ్‌ను గత ఏడాది ఆగస్టులో అధికారులు ఛేదించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కేవలం కాగితాల మీద లారీలు నడుపుతూ.. నకిలీ ఈ-వే బిల్లుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు గండి కొట్టిన ఘనులను పట్టుకున్నారు. సుమారు 75 బడా కంపెనీలు అమ్మకాలను తకువగా చూపేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాయి. 45 కంపెనీల ఆడిట్‌లో రూ.3,000 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్టు జీఎస్టీ ఉన్నతాధికారుల కమిటీ తేల్చింది. ఇందులో నకిలీ ఈ-వే బిల్లులు సృష్టించి ట్యాక్స్‌ ఎగ్గొట్టారు. హైదరాబాద్‌కు చెందిన కేషాన్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థ 100 కోట్ల నకిలీ బిల్లులతో రూ.33.2 కోట్ల ఐటీసీని అక్రమంగా క్లెయిమ్‌ చేసినట్టు కమర్షియల్‌ ట్యాక్స్‌శాఖ 2025 జూలైలో గుర్తించింది. తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం 2025లో మొత్తం రూ.228 కోట్ల పన్ను ఎగవేతను పట్టుకుని, అందులో రూ.213 కోట్లను రికవరీ చేసింది.

కలకలం రేపిన కాంగ్రెస్‌ నేత అరెస్టు
ఈ ఏడాది జనవరిలో రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్‌ నేత అరెస్టు కావడం రాజకీయంగా కూడా కలకలం రేపింది. ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత, కాంగ్రెస్‌ నేత ముత్యాల సునీల్‌ కుమార్‌ను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల నుంచి జీఎస్టీ వసూలు చేసినప్పటికీ, ఆ మొత్తం రూ.28.24 కోట్లు ప్రభుత్వానికి జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది.

రియల్‌ ఎస్టేట్‌లో తనిఖీలు
హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోనూ భారీగా పన్ను ఎగవేత జరుగుతున్నదని ప్రభుత్వం గుర్తించింది. జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్స్‌ (జేడీఏ)లో భూ యజమాని, బిల్డర్‌ మధ్య జరిగే లావాదేవీలపై జీఎస్టీ సరిగ్గా చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. అలాగే స్టీల్‌, సిమెంట్‌ కొనుగోలు చేసినట్టు నకిలీ బిల్లులు సృష్టించి, కోట్లాది రూపాయల ఐటీసీని క్లెయిమ్‌ చేస్తున్న సుమారు 120కిపైగా నిర్మాణ రంగ కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్ల అమ్మకాల్లో వైట్‌ మనీ కంటే బ్లాక్‌ (నగదు) ఎకువగా తీసుకుంటున్నట్టు గుర్తించి ఐటీ, జీఎస్టీ విభాగాలు సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి.

తయారీ రంగం
తెలంగాణలోని పారిశ్రామిక ప్రాంతాలైన పటాన్‌చెరు, జీడిమెట్ల, కొత్తూరు వంటి చోట్ల తనిఖీలు పెరిగాయి. ముఖ్యంగా ఐరన్‌, స్టీల్‌ స్రాప్‌ వ్యాపారంలో భారీగా జీఎస్టీ ఎగవేత జరుగుతున్నది. అసలు వస్తువు సరఫరా కాకుండానే కేవలం బిల్లులు మార్పిడి చేసి ట్యాక్స్‌ బెనిఫిట్‌ పొందుతున్న నెట్‌వర్‌ను ప్రభుత్వం ఛేదించింది. ఫార్మా, కెమికల్‌ కంపెనీలు తాము కొన్న ముడి సరుకు పరిమాణాన్ని ఎకువగా చూపి, లాభాలను తకువగా చూపడం ద్వారా పన్నులు ఎగ్గొడుతున్నట్టుగా గుర్తించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.