ఏపీలోని పించన్‌దారులకు భారీ గుడ్‌న్యూస్ అందింది. ఈ సారి పించన్ సొమ్ము ఒకరోజు ముందుగానే చేతికి అందనుంది. ఈ మేరకు ఒకరోజు ముందుగానే పింఛన్ సొమ్ము లబ్దిదారులకు అందించాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒకరోజు ముందుగానే చేతికి అందనుండటంతో పింఛన్‌దారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మార్చి నెల పింఛన్ ఒకరోజు ముందుగానే అందించాలని స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందికి తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సారి మార్చి 1వ తేదీన ఆదివారం వస్తోంది. ఆ రోజు ప్రభుత్వ ఆఫీసులకు సాధారణ సెలవు రోజు కావడంతో ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ రోజున ఇంటి వద్దకే వెళ్లి నేరుగా లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేయనున్నారు.
ఉదయం నుంచే పింఛన్ పంపిణీ
ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం నుంచి సచివాలయ సిబ్బంది లబ్దిదారులు పింఛన్ అందించనున్నారు. సాయంత్రం వరకు అందించనున్నారు. ఒకవేళ ఫిబ్రవరి 28వ తేదీన తీసుకోనివారికి మార్చి 2వ తేదీన అందించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కూడా ఆదివారం రావడంతో జనవరి 31న లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సారి కూడా మార్చి 1న సండే రావడంతో ఫిబ్రవరి నెలలోనే పింఛన్ పంపిణీకి సిద్దమయ్యారు. ప్రతీ నెలా ఒకటో తేదీన ప్రభుత్వం పింఛన్ సొమ్ము అందిస్తోంది. ఆ రోజు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తూ వస్తోంది. దీని వల్ల లబ్దిదారులు పింఛన్ ఎప్పుడు వస్తుందా.. లేదా అని ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.
ఇంటి వద్దనే పంపిణీ
ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం ద్వారా వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతీ నెలా పింఛన్ అందిస్తోంది. వృద్దులు, వితంతువులకు రూ.4 వేలు ఇస్తోండగా.. దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తోంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10 వేల పింఛన్ అందిస్తోంది. సచివాలయం సిబ్బంది నేరుగా లబ్దిదారుల ఇంటికే వెళ్లి బయోమెట్రిక్ వివరాల ఆధారంగా సొమ్ము అందిస్తున్నారు. అయితే పించన్ పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రతీ నెలా ఒక జిల్లాలో పర్యటిస్తున్నారు. లబ్దిదారులకు నేరుగా తన చేదుల మీదుగా పింఛన్ అందించి వారితో మాట్లాడుతున్నారు. వారి బాగోగులు, ఆర్ధిక పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ఈసారి చంద్రబాబు పర్యటన ఎక్కడ ఉంటుందనేది ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. త్వరలోనే ఈ షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశముందని తెలుస్తోంది.



































