తమిళనాడు పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. లైంగిక విధింపుల కేసులో ఓ జ్యోతిష్యుడికి 200ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాధితులకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 2021 నవంబర్ లో ఈ ఘటనపై కేసు నమోదు కాగా తాజాగా తమిళనాడు పోక్సో కోర్టు తీర్పును వెల్లడించింది. శివగంగ జిల్లా మనగిరి ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల రామకృష్ణన్ అనే జ్యోతిష్యుడి వద్దకు.. 2021 నవంబర్‌లో ఓ మహిళ వచ్చింది. తన ఇద్దరు కుమార్తెలకు చదువులో రాణించేలా చేయాలని వేడుకుంది. ఈ క్రమంలో తన వెంట ఇద్దరు కుమార్తెలను తీసుకుని రామకృష్ణన్‌ను వద్దకు వెళ్లింది. ఏదైనా పరిష్కారం చెప్పమని కోరింది. అయితే పిల్లలకు పూజలు చేయాలని నమ్మించిన జ్యోతిష్యుడు.. వారిని తన ఇంటికి పిలిపించుకున్నాడు. అలా తల్లిని వేరే గదిలో కూర్చోబెట్టి.. 18 ఏళ్లు, 14 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు బాలికలను వేరే గదిలోకి తీసుకువెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారిని బెదిరించాడు. దీంతో తల్లిదండ్రులకు ఏమీ కాకూడదని భావించిన ఆ బాలికలు జరిగిన విషయం ఎవరికీ చెప్పలేదు.
అయితే దాదాపు రెండేళ్ల తర్వాత.. ఆ ఇద్దరు అమ్మాయిలకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆ బాలికలకు లైంగికంగా సంక్రమించే వ్యాధి ఉన్నట్లు తేలింది. దాంతో పిల్లలిద్దరిని విచారించగా జ్యోతిష్కుడి నిర్వాకం బయటపడింది. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుపత్తూరు మహిళా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
అయితే తాజాగా శివగంగ జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి గోకుల్ మురుగన్ ఈ కేసులో కీలక తీర్పునిచ్చారు. లైంగిక విధింపుల కేసులో ఆ జ్యోతిష్యుడికి 200ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే బాధితులకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు.




































